కల్కి ఎడి2898 ట్రైలర్‌ రేపే విడుదల

June 09, 2024


img

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పడుకొనే, దిశా పటానీ హీరో హీరోయిన్లుగా కల్కి ఏడి 2898 సినిమా ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. భారత్‌ కాలమాన ప్రకారం అమెరికాలో ఒకరోజు ముందే విడుదలవుతుంది.

కనుక కల్కి ట్రైలర్‌ విడుదల చేసే సమయం కూడా దగ్గర పడింది. రేపు సోమవారం కల్కి ఎడి2898 ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే వైజయంతీ మూవీస్‌ ప్రకటించింది.

ఈ సినిమా కధ ఆధారంగా నాగ్ అశ్విన్ బృందం బుజ్జీ & భైరవ అనే ఓ యానిమేషన్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. కనుక ప్రభాస్‌ అభిమానులు, సినీ ప్రేమికులు కల్కి ఎడి2898 ట్రైలర్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటలలో అది విడుదల కాబోతోంది.    

ఈ సినిమాలో ప్రభాస్‌ భైరవగా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్‌ నటుడు కమల్ హాసన్, రానా దాగుబాటి, దుల్కర్ సల్మాన్, పశుపతి, శాశ్వత చటర్జీ, అన్నా బెన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.      

రూ.600 కోట్ల బారీ బడ్జెట్‌తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి. అశ్వినీ దత్ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష