హరిహర వీరమల్లు ఆగిపోలేదు... చిన్న బ్రేక్ మాత్రమే: నిర్మాత

February 27, 2024


img

పవన్‌ కళ్యాణ్‌ ఏపీ రాజకీయాలలో బిజీ అయిపోవడంతో ఆయన మొదలుపెట్టిన సినిమాలన్నీ అర్దాంతరంగా ఆగిపోయాయి. వాటిలో అన్నిటి కంటే ముందుగా మొదలుపెట్టిన హరిహరవీరమల్లు కూడా ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2021లో ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టారు. అప్పటి నుంచి 2023 వరకు నత్తనడకన సాగుతూనే ఉంది. 

దాని తర్వాత మొదలుపెట్టిన ‘బ్రో’ సినిమాని పవన్‌ కళ్యాణ్‌ కేవలం నెలరోజులలో పూర్తి చేయగా అది విడుదలై వెళ్లిపోయింది కూడా. కానీ క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో 2023లో మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్‌ రెండు సినిమాలను మాత్రం పవన్‌ కళ్యాణ్‌ నేటికీ పూర్తిచేయలేకపోయారు. 

ఏప్రిల్‌-మే నెలల్లో జరుగబోయే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో టిడిపితో కలిసి జనసేన పోటీ చేస్తోంది. కనుక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పవన్‌ కళ్యాణ్‌ ఈ రెండు సినిమాలకు సమయం కేటాయించడం చాలా కష్టం. కనుక హరిహర వీరమల్లు పూర్తిగా అటకెక్కించేసిన్నట్లేనని, ఈ సినిమాని మళ్ళీ వేరే దర్శకుడు హీరోతో మళ్ళీ మొదటి నుంచి తీయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

వాటిపై నిర్మాత ఏఎం రత్నం స్పందిస్తూ, “అవన్నీ ఊహాగానాలే. ప్రస్తుతం ఈ సినిమా విజుయవల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా పవన్‌ కళ్యాణ్‌ కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలువబోతోంది. ఈ సినిమాకి రెండో భాగం కూడా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తాను,” అని చెప్పారు. 

 మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్. 

మేలో ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకొని ఈ రెండు సినిమాలు పూర్తి చేసే అవకాశం ఉంది. కనుక 2025లో ఈ రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష