పిల్ల బచ్చాలు మా సినిమాకి రావొద్దు: తంత్ర వెరైటీ ప్రమో

February 23, 2024


img

ఏ సినిమాకైనా ప్రేక్షకులు సకుటుంబ సపరివారంగా అందరూ తరలిరావాలని దర్శక నిర్మాతలు కోరుకుంటారు. కానీ తమ సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని, ఎందుకంటే మాది ‘ఏ’ సర్టిఫికేట్ పొందిన సినిమా అని వెరైటీగా ఆ సినీ బృందం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

“టెడ్డీ బేర్‌కు మీరు జోలపాడితే బాగుంటుంది. కానీ ఆ టెడ్డీ బెరే మీకు జోలపాడితే... ఆ ఊహే భయంకరంగా ఉంది కదా! అలాంటిదే ఈ ‘తంత్ర’ సినిమా. మార్చి 15న మీ ముందుకు వస్తోంది. మీరు సిద్ధమా?” అంటూ ప్రేక్షకులకు సవాలు విసిరింది.     

ఈ హీరోయిన్‌ ఓరియంటడ్ సినిమాలో (మల్లేశం హీరోయిన్‌) అనన్య నాగళ్ళ ప్రధాన పాత్ర చేస్తుండగా, దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కుమారుడు ధనుష్ రఘుముద్రి తొలిసారిగా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇంతకాలం గ్లామర్ రోల్స్ చేస్తూ కాలక్షేపం చేసిన సలోని ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. 

తాంత్రిక శక్తులు, దెయ్యాలు, భూతాలు, క్షుద్రపూజల చుట్టూ అల్లుకున్న కధతో హర్రర్ జోనర్లో తంత్రని గొప్పిశెట్టి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. 

గత ఏడాది డిసెంబర్‌ 8వ తేదీన విడుదలైన ఈ సినిమా టీజర్‌ చూస్తే పిల్ల బచ్చాలు ఈ సినిమాకి దూరంగా ఉండటమే మంచిదనిపిస్తుంది. 

ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, ధనుష్ రఘుముద్రి, శాల్ని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని, మనోజ్ ముత్యం తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: శ్రీనివాస్ గోపిశెట్టి, సంగీతం: ఆర్ఆర్. ధ్రువన్, కెమెరా: సాయి రామ్ ఉదయ్, విజయ్‌ దేవరకొండ భాస్కర్ సద్దల, ఎడిటింగ్: ఉద్ధవ్ చేస్తున్నారు. 

ఫస్ట్ కాపీ మూవీస్, బి ది వే ఫిలిమ్స్, వైజాగ్ ఫిలిమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నరేశ్ బాబు, రాష్ట్రవ్యాప్తంగా చైతన్య నిర్మిస్తున్నారు. మార్చి 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. Related Post

సినిమా స‌మీక్ష