చిరంజీవితో ఓ సినిమా: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

February 07, 2024


img

తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్ధాలుగా ఉన్న సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతీ మూవీస్ వంటి సంస్థలు సినీ నిర్మాణంలో వెనుకపడిపోగా, యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్, గీతా ఆర్ట్స్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి అనేక సంస్థలు దూసుకుపోతున్నాయి. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2015లో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి అనేక సినిమాలు నిర్మించింది. మరో 20 సినిమాలు వివిద దశలలో ఉన్నాయి. అయితే సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరో చిరంజీవితో ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేకపోయామని, ఆయన కోసం చాలా కాలంగా కధలు వింటున్నామని, ఇప్పటికి ఆయనకు సరిపడే ఓ మంచి పవర్‌ఫుల్ కధ దొరికిందని ఆ సంస్థ అధినేత టీజి.విశ్వప్రసాద్ చెప్పారు.

త్వరలోనే చిరంజీవిని కలిసి ఈ కధ వినిపిస్తామని, ఆయనకు ఆ కధ నచ్చి ఓకే చెపితే, చిరంజీవితో కూడా సినిమా చేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతామని అన్నారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో రవితేజ నటించిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కాబోతోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోంది.

చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లాది దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర’ మొదలుపెట్టారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత కుమార్తె సుస్మితా నిర్మాతగా ఓ సినిమా చేసే అవకాశం ఉంది. కనుక చిరంజీవితో సినిమా కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో ఏడాది ఎదురుచూడక తప్పదేమో?


Related Post

సినిమా స‌మీక్ష