మహేష్-త్రివిక్రం సినిమా టైటిల్‌, పోస్టర్‌ నేడే విడుదల

May 31, 2023


img

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆనాడు ఆయన నటించిన దేశంలోని మొట్ట మొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాను నేడు మళ్ళీ విడుదల చేయబోతున్నారు. ఇదే సందర్భంగా ఆయన కుమారుడు, మహేష్ బాబు త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పోస్టర్‌ విడుదల చేశారు. ఈరోజు సాయంత్రం ఈ సినిమా టైటిల్‌, 1.03 నిమిషాల నిడివిగల టీజర్ కూడా ప్రకటించనున్నారు.

త్రివిక్రం శ్రీనివాస్‌కి సినిమా టైటిల్స్ విషయంలో ఉన్న ‘ఆ’ సెంటిమెంట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన తీసిన సినిమా పేర్లన్నీ అ, ఆ అక్షరాలతోనే మొదలయ్యాయి. అ ఆ, అతడు, అత్తారింటికి దారేది?, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అంతకు ముందు నువ్వే నువ్వే, జల్సా, ఖలేజా, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు కూడా చేసినప్పటికీ అఆ సినిమా నుంచి 'అ' సెంటిమెంట్ కొనసాగిస్తున్నారు. కనుక ఈ సినిమాకి కూడా అ అక్షరంతోనే "అసుర సంధ్య వేళ"  అని పేరు ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ అవి నిజమో కాదో మరికొన్ని గంటలలో తెలుస్తుంది.   

తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు తలకి ఎర్రగుడ్డ కట్టుకొంటున్నట్లు చూపారు. తనను చుట్టుముట్టిన విలన్‌ గ్యాంగ్‌తో ఫైట్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు అర్దమవుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. Related Post

సినిమా స‌మీక్ష