ఎన్టీఆర్‌-కొరటాల సినిమా దేవర! అది నా టైటిల్‌... కొట్టేశారు!

May 19, 2023


img

ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ముందే అనుకొన్నట్లుగా ‘దేవర’ అని టైటిల్‌ ఖరారు చేశారు. దీనిపై నిర్మాత బండ్ల గణేశ్ వెంటనే అభ్యంతరం తెలిపారు. ‘దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకొన్న టైటిల్‌. నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్‌ పోస్టర్‌ను కొట్టేశారు అంటూ కోపంగా చూస్తున్న ఇమోజినీ పోస్ట్ చేశారు.

పవన్‌ కళ్యాణ్‌కు వీరభక్తుడైన బండ్ల గణేశ్ ఆయనను గౌరవంగా దేవర అని పిలిచుకొంటారనే సంగతి అందరికీ తెలిసిందే. కనుక అదే టైటిల్‌తో పవన్‌ కళ్యాణ్‌తో సినిమా తీయాలనుకొన్నారు. కానీ వీలుపడకపోవడంతో ఎన్టీఆర్‌ సినిమా కోసం ఆ టైటిల్‌ అడిగితీసుకొన్నన్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ తనను అడగకుండానే ఆ టైటిల్‌ తీసుకొన్నారని బండ్ల గణేశ్ ట్వీట్‌ ద్వారా స్పష్టమైంది. ఎన్టీఆర్‌ వంటి అగ్రనటుడుతో సినిమా తీస్తున్నప్పుడు ఇటువంటి వివాదాలకు తావు లేకుండా చూసుకొంటే బాగుండేది. 

 

దేవర టైటిల్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. నల్లటి దుస్తులలో చేతిలో రక్తం కారుతున్న సొర చేపలను వేటాడే బల్లెంవంటి ఆయుధం పట్టుకొని ఆలలు ఎగసి పడుతున్న సముద్రం వైపు గంభీరంగా చూస్తున్న ఎన్టీఆర్‌ పోస్టర్‌ చాలా బాగుంది. 

ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా అలనాటి మేటి నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు ఈరోజు మరోసారి ఖరారు చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష