ఆర్ఆర్ఆర్‌కి ఇది ఆస్కార్ కంటే గొప్ప అవార్డే కదా?

January 21, 2023


img

ఆర్ఆర్ఆర్‌ సినిమా ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. టెర్మినేటర్, అవతార్, టైటానిక్ వంటి గొప్ప సినిమాలు తీసిన హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ఈ సినిమాని రెండుసార్లు చూసి రాజమౌళిని ప్రశంశలతో ముంచెత్తారు. ఈ సినిమాని చూడటమే కాక సినిమాలో ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ పాత్రల తీరుని, కధని మలిచిన తీరు, ఫ్లాష్ బ్యాక్, ముఖ్యంగా ఈ సినిమాలో నీళ్ళు, నిప్పు కాన్సెఫ్ట్‌ దానిని తెరపై ఆవిష్కరించిన తీరు తనకి చాలా బాగా నచ్చిందని జేమ్స్ కెమెరూన్ ప్రశంశించారు.

ఓ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఓ భారతీయ చిత్రాన్ని రెండుసార్లు చూసి దానిని విశ్లేషించడమే గొప్ప విషయమనుకొంటే, ఆయన తనతో మాట్లాడుతూ “మీరు ఎప్పుడైనా హాలీవుడ్‌లో సినిమాలు తీయాలనుకొంటే చెప్పండి మాట్లాడుకొందాం,” అంటూ తనతో కలిసి పనిచేయడానికి సంసిద్దత చూపడం ఆస్కార్ అవార్డ్ కంటే గొప్పగా అనిపించిందని రాజమౌళి చెప్పారు.

సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి తాను తీవ్ర భావోద్వేగంతో లేచి నిలబడిపోయానని జేమ్స్ కేమరూన్ చెప్పడంతో తాను ఆనందంతో పొంగిపోయానని రాజమౌళి చెప్పారు. జేమ్స్ కేమరూన్‌తో తనతో మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియోని రాజమౌళి సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేశారు.

     

Related Post

సినిమా స‌మీక్ష