టాలీవుడ్‌-కోలీవుడ్ మద్య కొత్త వివాదం

November 19, 2022


img

టాలీవుడ్‌, కోలీవుడ్ దర్శకనిర్మాతల మద్య సరికొత్త వివాదం మొదలైంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ హీరో విజయ్‌ తొలిసారిగా స్ట్రెయిట్ తెలుగు చిత్రం ‘వారసుడు’ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో దానిని ‘వారిసు’గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగులోనే తీస్తున్నప్పటికీ తమిళ వెర్షన్‌కి డబ్బింగ్ చిత్రంగానే పరిగణిస్తున్నామని, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో దీనిని విడుదల చేయబోతున్నామని ఈ చిత్ర నిర్మాత దిల్‌ రాజు ఇదివరకే ప్రకటించారు. ఇదే ఈ వివాదానికి బీజం వేసింది. 

ఇటీవల తెలుగు నిర్మాణాల మండలి నెలరోజుల పాటు సినిమా షూటింగ్స్ నిలిపివేసినప్పుడు, సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగల సీజనులో స్ట్రెయిట్ తెలుగు సినిమాలకే థియేటర్లను కేటాయించాలని దిల్‌ రాజు సూచించారు. కానీ ఇప్పుడు ఆయనే సంక్రాంతికి తన డబ్బింగ్ సినిమా వారసుడిని విడుదల చేయాలనుకోవడం సరికాదని, తెలుగు సినీ నిర్మాతల మండలి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆరోజు దిల్‌ రాజు చేసిన ప్రతిపాదనకు కట్టుబడి ఉండాలని, సంక్రాంతికి తెలుగు హీరోల స్ట్రెయిట్ చిత్రాల విడుదలకు సహకరించాలని కోరుతూ ఓ ప్రకటన చేసింది. 

దీనిపై దిల్‌ రాజు స్పందించేలోగా కోలీవుడ్ దర్శక, నిర్మాతలు కొందరు ఘాటుగా స్పందించడం మొదలుపెట్టారు. పండుగల సీజనులో తమిళనాడులో తెలుగు డబ్బింగ్ సినిమాలు విడుదలవుతుంటే వాటిని తాము ఏనాడూ అడ్డుకోలేదని కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో తమిళ డబ్బింగ్ సినిమాలు అడ్డుకోవాలనుకోవడం సరికాదని వాదించడం మొదలుపెట్టారు. విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాని ఒకవేళ సంక్రాంతికి విడుదల కాకుండా అడ్డుకొంటే, ఇక్కడ తామూ కూడా తెలుగు డబ్బింగ్ సినిమాలను అడ్డుకొంటామని వారు హెచ్చరించారు. 

కనుక ఇప్పుడు నిర్మాత దిల్‌ రాజు ఇరుకున పడినట్లయింది. తన సినిమా సంక్రాంతికి విడుదల చేయకుండా నిలిపివేస్తే కోలీవుడ్‌లో అందరికీ కోపం వస్తుంది. విడుదల చేస్తే ఇక్కడ టాలీవుడ్‌ ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేర్ వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి చిత్రాలు రెండూ సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వారసుడు డబ్బింగ్ సినిమా అని నిర్మాత దిల్‌ రాజు చెపుతున్నప్పటికీ ఆ సినిమాని దర్శకుడు   వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు కనుక తెలుగు సినిమాగానే ప్రేక్షకులు పరిగణించి చూస్తారు కనుక వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు అది గట్టి పోటీ ఈయవచ్చు.          

వారసుడు సినిమాలో విజయ్‌కి జోడీగా రష్మిక మందన నటిస్తుండగా, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమాకి సంగీతం ఎస్‌. ధమన్, కెమెరా: కార్తీక్ పళని అందిస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష