ఇప్పుడు ఆమెకు శీలపరీక్ష అవసరమా?

December 22, 2017


img

దేశంలో ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఎప్పుడో కొన్ని యుగాల క్రితం జరిగిన మహాభారతంలోని ద్రౌపది పాత్ర గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి సరికొత్త వివాదానికి తెరతీశారు. సాధారణంగా కాంగ్రెస్ లేదా ఇతరపార్టీల నేతలు ఇటువంటి అంశాలపై నోరు జారి భాజపా విమర్శలకు ఎదుర్కొంటుంటారు. కానీ ఈసారి భాజపా నేతే నోరుజారడం విశేషం.

గోవా రాజధాని పణాజిలో జరిగిన ఒక కార్యక్రమంలో రామ్ మాధవ్ ప్రసంగిస్తూ, “ఈ ప్రపంచంలో మొట్టమొదటి స్త్రీవాది ఎవరంటే ద్రౌపది పేరు చెప్పవచ్చు. అయితే ఆమె తన ఐదుగురు భర్తల కంటే తన స్నేహితుడు, శ్రేయోభిలాషి అని భావించిన శ్రీకృష్ణుడి మాటనే ఎక్కువ పాటించేది. అలాగని ఆమెలో విశ్రుంఖలత్వం ఉందని కాదు. ఆమె తన భర్తలకు కట్టుబడే ఉండేది. ఆమె పట్టుదల కారణంగానే కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగి దానిలో 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్దానికి ఆమె పట్టు పట్టకపోయుంటే అంత మారణహోమం జరిగి ఉండేదేకాదు. కనుక ఆ అపఖ్యాతి ఆమెకే చెందుతుంది,” అన్నారు రామ్ మాధవ్.

ద్రౌపది గురించి మాట్లాడుకోదలిస్తే రెండు ముఖ్యమైన అంశాలు చెప్పుకోవడం మంచిది. ముందుగా ఆమె దృడమైన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి. ద్రౌపది చాలా దృడమైన వ్యక్తిత్వం కలిగినది కనుకనే ఆమె జీవితంలో ఎవరూ ఊహించలేని సంఘటనలు, ఆటుపోట్లు ఎదురైనా క్రుంగిపోకుండా నిలబడగలిగింది. రెండవది ఆమెకు నిండు సభలో జరిగిన ఘోర అవమానం. ఆ కాలం నుంచే మహిళల పట్ల పురుషుల తీరు దారుణంగా ఉందని చెప్పడానికి అది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

నేటికీ మన సమాజంలో మహిళలు అటువంటి సవాళ్ళనే ఎదుర్కోవలసి వస్తోంది. (ఇటీవల విశాఖనగరం పెందుర్తి అనే ప్రాంతంలో కొందరు అధికార పార్టీ నేతల భూకబ్జాలను ఒక దళిత మహిళా అడ్డుకొన్నందుకు, సదరు నేత అనుచరులు ఆమెను వివస్త్రను చేశారు. ఇక నిన్న సాయంత్రమే సికింద్రాబాద్, లాలాగూడ వద్ద సంధ్యారాణి అనే యువతి ఒక ప్రేమోన్మాది చేతిలో సజీవదహనం అయిపోయింది.) కనుక నేటి మహిళలకు కూడా ద్రౌపది అంతటి ధైర్యం, దృడమైన వ్యక్తిత్వం చాలా అవసరం. ద్రౌపది పాత్రను అంతవరకే తీసుకొంటే బాగుంటుంది. ఇప్పుడు ఆమెకు శీలపరీక్ష చేయనవసరం లేదు కదా! పైగా రామాయణ, మహాభారత కాలంలో జరిగిన వాటిని పట్టుకొచ్చి ఇప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడటం, కొట్టుకోవడం, రాజకీయాలు చేయడం అవసరమా? ఇప్పటికే దేశానికి ఉన్న సమస్యలు సరిపోవా? ఉన్నవాటిని పరిష్కరించలేనప్పుడు మళ్ళీ పాతవి త్రవ్వుకొని కొత్త సమస్యలు సృష్టించుకోవడం ఎందుకు? దాని వలన ఏమి ప్రయోజనం? అని ఆలోచిస్తే మంచిది. 


Related Post