ఆచార్యుని స్ఫూర్తియాత్ర సాగేనా?

December 22, 2017


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేటి నుంచి రెండు రోజులపాటు నల్లగొండ జిల్లాలో తెలంగాణా అమరవీరుల స్ఫూర్తియాత్ర నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ ఎల్బి నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి తన యాత్రాను ప్రారంభిస్తారు. ఈరోజు స్ఫూర్తియాత్రలో సంస్థాన్ నారాయణ్ పూర్, మునుగోడు, నల్లగొండ పట్టణంలో పర్యటించి సాయంత్రం స్థానిక ఎన్జీ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. మళ్ళీ శనివారం ఉదయం నార్కాట్ పల్లి, కట్టంగూరు, మిర్యాలగూడ మీదుగా సూర్యాపేట చేరుకొని సాయంత్రం అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు.             

 నల్లగొండ జిల్లాలో త్రాగునీరు,సాగునీటి సమస్యలు, దానికి కారణం అవుతున్న పారిశ్రామిక కాలుష్యం, రైతుల ఆత్మహత్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల గురించి ప్రొఫెసర్ కోదండరాం బహిరంగ సభలలో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

అయితే ప్రొఫెసర్ కోదండరాం ప్రతీసారి స్పూర్తియాత్ర షెడ్యూల్ ప్రకటించడం, దానికి అనుమతి లేదంటూ పోలీసులు అయనను అదుపులో తీసుకోవడం జరుగుతోంది. కనుక ఈరోజు మొదలుపెట్టిన యాత్ర ఎంతవరకు సాగుతుందో చూడాలి. 

ప్రొఫెసర్ కోదండరాం తనకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెపుతున్నప్పటికీ, ప్రభుత్వంపై అయన చేస్తున్న విమర్శలు, అయన కార్యక్రమాలు అన్నీ ఒక ప్రతిపక్షనేతనే తలపిస్తున్నాయి. కనుక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ మేధావి ముసుగులో ప్రజలను రెచ్చగొట్టే బదులు నేరుగా ప్రత్యక్షరాజకీయాలలో వచ్చి తమను ఎదుర్కోవాలని తెరాస సవాలు విసురుతోంది. కానీ దానిని ఆయన స్వీకరించడం లేదు. 

ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాజకీయ పార్టీ పెట్టడమో లేదా పార్టీలో చేరడమో తప్పనిసరి కాదు. అలాగే అయన తనకు నచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వడం కూడా తప్పు కాదు. రాజకీయాలలో ఉన్నవారు మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే నియమేమీ లేదు కనుక ఈ విషయంలో ఆయనను తెరాస ఒత్తిడి చేయలేదు. అదేవిధంగా అయన తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అయన యాత్రను అడ్డుకోవడం కూడా సరికాదు. ఆయనపై ఎదురుదాడి చేయడంకంటే అయన సంధిస్తున్న ప్రశ్నలకు తెరాస నేతలు సూటిగా సమాధానాలు చెప్పగలిగితే, ప్రొఫెసర్ కోదండరాం, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇద్దరిలో ఎవరి విధానం సరైనదో ప్రజలే నిర్ణయించుకొంటారు కదా!  


Related Post