అందుకే కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడుతున్నారా?

December 22, 2017


img

పార్లమెంటు సమావేశాలు మొదలయ్యి వారంరోజులు అవుతోంది కానీ ఇంతవరకు ఒక్కరోజు కూడా ఉభయసభలలో ఎటువంటి చర్చలు జరుగకుండా కాంగ్రెస్ సభ్యులు అడ్డుపడుతున్నారు. రాజ్యసభలో నిన్న సచిన్ టెండూల్కర్ మాట్లాడేందుకు లేచి నిలబడినపుడు కూడా వారు ఆయనను మాట్లాడనీయకుండా సభలో అరుపులు, కేకలతో హోరెత్తించారు. తనను అడ్డు తొలగించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ తో చేతులు కలిపిందని ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. తమపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉభయసభలను స్తంభింపజేస్తున్నారు. 

అయితే ఇప్పుడు ప్రధాని మోడీ క్షమాపణ కోరినట్లయితే, ఆరోజు ఎన్నికల ప్రచారంలో తాను చేసిన ఆ ఆరోపణ అబద్దమని అంగీకరించినట్లు అవుతుంది కనుక అయన మెట్టు దిగేందుకు ఇష్టపడటం లేదు. ఈ సంగతి కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. కానీ క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతూ ఉభయసభలను స్తంభింపజేస్తోంది. దేనికి? అని సందేహం కలుగకమానదు.

రాహుల్ గాంధీ స్వయంగా పూనుకొని గట్టిగా ప్రచారం చేసినా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కనుక ఈ ఓటమిని అయన వైఫల్యంగానే భావించకతప్పదు. ఒకేసారి రెండు రాష్ట్రాలలో ఓడిపోయిన ఈ సమయంలోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టారు. కనుక పార్లమెంటు సభలను సజావుగా సాగనిస్తే, భాజపా సభ్యులు రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి, రెండు రాష్ట్రాలలో ఓటమి గురించి ప్రస్తావించక మానరు. అది రాహుల్, సోనియా గాంధీలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పిస్తుంది. కనుకనే కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉభయసభలను స్తంభింపజేస్తున్నారని భావించకతప్పదు. 

పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యుల తీరు చూస్తుంటే, దాని నాయకత్వం మారిందే తప్ప దాని మూస రాజకీయ వైఖరి, ఆలోచనలు ఏమాత్రం మారలేదని అర్ధం అవుతోంది. తమ నాయకుడిపై నిందపడకుండా కాపాడుకొనేందుకు విలువైన పార్లమెంటు సమావేశాలను జరుగకుండా అడ్డుపడటానికి వెనుకాడటం లేదు. కాంగ్రెస్ తీరు ఎన్నటికీ మారదేమో? 


Related Post