ఆ సమస్య పరిష్కారానికి మోడీ విధానం సరికాదట!

December 16, 2017


img

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పిడిపి, భాజపాల సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. విశేషమేమిటంటే, వాటిలో భాజపాది జాతీయవాదం కాగా పిడిపిది 100 శాతం వేర్పాటువాదం. భిన్న దృవాలైన ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయగలగడం ఆశ్చర్యకరమైన విషయమే. దశాబ్దాలుగా కాశ్మీర్ ను పట్టి పీడిస్తున్న వేర్పాటువాదం సమస్య పరిష్కారం విషయంలో కూడా వాటివి పూర్తిగా భిన్నాభిప్రాయాలే.

వేర్పాటువాదులతో మృదువుగా వ్యవహరిస్తూ, పాకిస్తాన్ తో శాంతి చర్చలు జరపాలని పిడిపి అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కోరుకొంటుంటే, కాశ్మీర్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్న వేర్పాటువాదులను, ఉగ్రవాదులను ఉక్కుపాదం అణచివేయాలని, భారత్ కు పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్ కు మంచి మాటలతో చెపితే అర్ధం కాదు కనుక దానిని ప్రపంచ దేశాలలో ఏకాకిని చేసి ఒత్తిడి పెంచడం ద్వారా దాని జోరు తగ్గించాలని కేంద్రప్రభుత్వం (భాజపా) భావిస్తోంది.  

మోడీ సర్కార్ కాశ్మీర్ విషయంలో మొదట చాలా మెతకగానే వ్యవహరించి పరిస్థితులను సామరస్యంగా పరిష్కరించాలని చాలా ప్రయత్నాలు చేసింది. గత ఏడాది ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తరువాత కాశ్మీర్ లో సుమారు ఆరు నెలలపాటు సాగిన అల్లర్లను అదుపు చేయడంలో కూడా మోడీ సర్కార్ చాలా సంయమనం పాటించింది. కానీ మోడీ సర్కార్ ప్రదర్శించిన ఆ మంచితనాన్ని కాశ్మీర్ లో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వం అలుసుగా భావించి చెలరేగిపోయారు. ఒకానొక సమయం ఇక కాశ్మీర్ భారత్ చేజారిపోతుందేమోననే అనుమానాలు కలిగాయి.

అప్పటి నుంచే మోడీ సర్కార్ కాశ్మీర్ వేర్పాటువాదులపై రకరకాలుగా ఒత్తిడి పెంచుతూ, అదే సమయంలో కాశ్మీర్ లోకి అడుగుపెడుతున్న ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయడం ప్రారంభించింది. అది సత్ఫలితాలు ఇస్తోందని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఇప్పుడు కాశ్మీర్ లో రాళ్ళు రువ్వడం, ప్రభుత్వ పాఠశాలలు తగులబెట్టడం వంటివి చాలా వరకు తగ్గాయని చెప్పారు. 

అయితే, మోడీ సర్కార్ అనుసరిస్తున్న ఈ విధానంతో కాశ్మీర్ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని, ఈ విషయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి విధానాన్ని అనుసరించి పాకిస్తాన్ తో మళ్ళీ చర్చలు జరపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ చెప్పడం విశేషం.

“భద్రతాదళాలు కాశ్మీర్ లో కొంతమందిని ఏరిపడేసినంత మాత్రాన్న పాకిస్తాన్ నుంచి మళ్ళీ ఉగ్రవాదులు రారని నమ్మకం ఏమిటి? మసరత్ ఆలం (కరడుగట్టిన వేర్పాటువాది)ను జైలులో నిర్బందించడానికి బలమైన కారణాలు ఏవీ లేవు కనుక అతనిని విడిచిపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే ప్రభుత్వం ఏమి చేస్తుంది? వదిలిపెట్టక తప్పదు కదా? వేర్పాటువాదులతో ‘గాయాలను మాన్పేవిధంగా (హీలింగ్ టచ్) కేంద్రం వ్యవహరించాలి. అప్పుడే కాశ్మీర్ సమస్య పరిష్కారమవుతుంది. మేము (కశ్మీరీలు) ఇండియా అంటే ఇందిర...ఇండియా అంటే తాజ్ మహల్ అనుకొంటాము. హిందీ సినిమాలను చూసి ఆనందిస్తాము. ఇండియా పట్ల మా దృకోణాన్ని భారత ప్రభుత్వం అర్ధం చేసుకొని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తూ కాశ్మీర్ లో శాంతి నెలకోల్పాలని కోరుకొంటున్నాము,” అని అన్నారు.

మరి కాశ్మీర్ పై ఎవరి వైఖరి, వాదనలు సరైనవని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారు? చెపుతారా?


Related Post