మహాసభలు సరే..తెలుగుకు ఆదరణ ఎప్పుడు..ఎలా?

December 13, 2017


img

ఈనెల 15వ తేదీ నుంచి 19వరకు హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగబోతున్నాయి. వాటి కోసం తెలంగాణా ప్రభుత్వం చాలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. భిన్న సంస్కృతులకు, బాషలకు నిలయమైన హైదరాబాద్ మహానగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం చాలా ఆనందించదగ్గ విషయమే కానీ ప్రజలలో, ముఖ్యంగా యువతలో తెలుగు బాష పట్ల ఆసక్తి, అభిమానం, అవగాహన కల్పించడానికి ఏమి చేస్తున్నాము? ఇంటర్ వరకు తెలుగు బాషను తప్పనిసరి చేస్తే సరిపోతుందా? లేక తెలుగు బాషను అందరూ ఆదరించి అక్కున చేర్చుకొనేందుకు ఇంకా ఏమైనా చేయవలసి ఉందా? అని ప్రశ్నించుకోవలసిన సమయం ఇదే.

ఎందుకంటే, ఇంగ్లీష్ మీడియం చదువుల కారణంగా నేటి పిల్లలు, యువతలో చాలా మందికి తెలుగు వ్రాయడం, చదవడం రాదు. తల్లితండ్రులు కూడా అందుకు ఏమాత్రం సిగ్గు పడకపోగా అదేదో గొప్పవిషయమన్నట్లు గర్వంగా చెప్పుకొంటుంటారు. ఇక ఐటి రంగంలో ఉన్నవారైతే తెలుగు మాట్లాడటం చాలా నామోషీగా భావిస్తుంటారు. నేటికీ దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంగ్లీషు బాషలోనే సాగుతుండటం అందరికీ తెలిసిందే. 

ప్రజలు, పాలకులు కూడా మాతృబాష పట్ల ఇంతగానిరాధారణ, చులకనభావం కలిగి ఉన్నప్పుడు ఇక ఆ బాషకు ఏవిధంగా ఆదరణ, గౌరవం లభిస్తాయి?అది ఏవిధంగా ఎంతకాలం మనుగడ సాగించగలదు? అని ప్రశ్నించుకోక తప్పదు. గత నాలుగైదు దశాబ్దాలుగా సమైక్య రాష్ట్రంలో, ఇప్పటికీ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఇదే పరిస్థితులు నెలకొని ఉండటం గమనిస్తే తెలుగు బాష ఎంత నిరాదరణకు గురయిందో గ్రహించవచ్చు.

తెలుగు బాషాభివృద్ధి అంటే అదేదో ప్రభుత్వానికి సంబంధించిన విషయమని ప్రజలు, అది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం లేదా ఉపాధిమార్గమని ప్రభుత్వాలు భావిస్తుంటాయి. అందుకే తెలుగు రాష్ట్రాలలో తెలుగు కళావిహీనంగా మారింది. ఇక తెలుగు బాషను కూడా ఒక్కటిగా చూడవలసిన తెలుగు ప్రభుత్వాలు, ‘మా తెలుగు..మీ తెలుగు’ అని వాదించుకోవడం బాధాకరమే.         

కనుక రెండు తెలుగు ప్రభుత్వాలు తమ రాజకీయ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ప్రజలలో తెలుగు బాషాభిమానం పెరిగేందుకు, అందరూ తప్పనిసరిగా మాతృబాషను నేర్చుకొనేందుకు ఇంకా ఎక్కువ కృషి చేయాల్సి ఉంది. ఈ మహాసభలలో అందుకు అవసరమైన సలహాలు, సూచనలు సేకరించి, వాటిని రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు అంతే చిత్తశుద్ధితో అమలుచేయడం చాలా అవసరం. అప్పుడే ఈ తెలుగు మహా సభల ఆశయం నెరవేరుతుంది. 


Related Post