గుజరాత్ లో భాజపాకు ఎదురుదెబ్బ తప్పదా?

November 22, 2017


img

ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, అద్వానీ వంటి అనేకమంది సీనియర్ భాజపా నేతలందరూ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారే. కనుక గుజరాత్ భాజపాకు కంచుకోటవంటిదని చెప్పవచ్చు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఎంపికయ్యే వరకు ఆయనే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. గుజరాత్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా భాజపాయే అధికారంలో ఉంది. అక్కడ పాగా వేయడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోతోంది. కానీ ఈసారి గుజరాత్ శాసనసభ ఎన్నికలలో భాజపాకు ఎదురుగాలి వీస్తోంది. జి.ఎస్.టి., నోట్లరద్దు, పటేల్ కులస్థుల వ్యతిరేకత వంటి అనేక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

ఈ అవకాశాన్ని వినియోగించుకొని గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలగా కృషి చేస్తున్న రాహుల్ గాంధీ, పటేల్ కులస్థులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమించిన యువనాయకుడు హార్దిక్ పటేల్ తో జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. కొద్దిసేపటి క్రితం హార్దిక్ పటేల్ స్వయంగా ఈవిషయం మీడియాకు తెలియజేశారు. తమకు ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్లు అడగలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వాలని కోరామని, అందుకు రాహుల్ గాంధీ అంగీకరించారని కనుక తాము ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకొన్నామని తెలిపారు. “నాకు ఇప్పట్లో రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదు. నేను ఎవరికీ కాంగ్రెస్ టికెట్స్ ఇవ్వమని రాహుల్ గాంధీని కోరలేదు. రిజర్వేషన్ల గురించే మేము చర్చించుకొన్నాము. రెండు దశాబ్దాలుగా భాజపా చేతిలో తమ పటేల్ కులస్తులు మోసపోతూనే ఉన్నారు. కనుక ఈ ఎన్నికలలో దానికి తగిన విధంగా బుద్ధి చెప్పడానికే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపుతున్నాము,” అని చెప్పారు. 

గుజరాత్ లో పటేల్ కులస్థుల జనాభా తక్కువే అయినప్పటికీ, రాష్ట్ర రాజకీయాలపై వారి ప్రభావం చాలా ఎక్కువే. కనుక వారు ఈ ఎన్నికలలో భాజపాకు దూరంగా జరిగి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం భాజపాకు నష్టమేనని చెప్పవచ్చు. కనుక భాజపాకు అత్యంత ముఖ్యమైన ఈ అసెంబ్లీ ఎన్నికలలో అది ఏటికి ఎదురీదకతప్పదు. ఎదురీది గెలిస్తే పరువలేదు కానీ ఓడిపోతే భాజపాపై ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉండవచ్చు. 


Related Post