ఆ విషయంలో తెరాస సర్కార్ విధానం ఏమిటో?

November 21, 2017


img

దేశంలో రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటితో బాటు ప్రభుత్వాల ప్రాధాన్యతలు, ఆలోచనలు, విధివిధానాలు అన్నీ మారిపోతుంటాయి. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా తెలుగు బాషకు ప్రాధాన్యత కల్పించే విషయంలో మాత్రం పాలకుల అశ్రద్ధలో ఎటువంటి మార్పులేదు. సాధారణంగా వారికి ఉగాది రోజున, ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే సమయంలో మాత్రమే తెలుగు బాష గుర్తుకు వస్తుంటుంది. అప్పుడే తెలుగు బాష గొప్పదనం, ప్రాధాన్యత, ప్రోత్సాహం కల్పించవలసిన అవసరం గురించి మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఏవో ప్రసంగాలు చేస్తుంటారు. ఆ తరువాత మళ్ళీ అదే అశ్రద్ధ షరా మామూలే.  

వచ్చే నెలలో హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగబోతున్నాయి. కనుక తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా తెలుగు బాషాభివృద్ధి గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో 12వ తరగతి వరకు తెలుగుబాషను తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ సంస్థల పేర్లను మొదట తెలుగులో దాని క్రింద తమకు నచ్చిన బాషలలో వ్రాసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇంగ్లీష్ మీడియం చదువులపై ప్రజలకు మోజు పెరగడంతో గత నాలుగు దశాబ్దాలుగా  తెలుగు విద్వంసం జరిగింది. అందుకే చాలా మంది తెలుగువారికి తెలుగు చదవడం, వ్రాయడం రాదు. తెలుగు రాకపోయినా ఇంగ్లీష్ బాషాపైనైనా పూర్తి పట్టు కలిగి ఉన్నారా అంటే అదీ ఉండదు. తెలుగు, ఇంగ్లీష్ రెండు బాషలలో దేనిపైనా పూర్తి పట్టులేకపోవడంతో వారు గట్టిగా నాలుగు ముక్కలు ఏ బాషలోను వ్రాయలేరు..మాట్లాడలేరు. అర్ధంకాని దుస్థితి ఏర్పడింది. ఇందుకు ప్రధానకారణం ప్రభుత్వాలు తెలుగు బాషకు ప్రాధాన్యతనీయకపోవడమేనని చెప్పకతప్పదు.          

ఉదాహరణకు కొంతకాలం క్రితం తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం అమలుచేసింది. ఇప్పుడు12వ తరగతి వరకు తెలుగుబాషను తప్పనిసరి చేసింది. పరస్పరవిరుద్దమైన ఈ రెండు నిర్ణయాలే తెలుగు బాష విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి, విధివిధానాలు లేవని నిరూపిస్తున్నాయి. తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలు పబ్బాలను ప్రోత్సహించి, వాటికి గుర్తింపు తేవడం కోసం ప్రభుత్వం ఏస్థాయిలో కృషి చేస్తోందో, తెలుగు బాషాభివృద్ధి కోసం కూడా నిరంతరంగా గట్టిగా కృషి చేసినప్పుడే తెలుగు బాషకు గుర్తింపు, ఆదరణ పెరుగుతుంది. 

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న ప్రగతి భవన్ లో తెలుగు సాహిత్య అకాడమీ చైర్మెన్ నందిని సిద్ధారెడ్డి, ప్రెస్ అకాడమి చైర్మెన్ అల్లం నారాయణ తదితరులతో సమావేశమయ్యారు. వచ్చే నెలలో హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలలో తెలుగు సాహిత్యం, తెలంగాణా కళలు, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిభింబించే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కెసిఆర్ ఒక మంచి ప్రతిపాదన చేశారు. తెలుగు బాషలో విద్యనభ్యసించిన విద్యార్ధులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యత కల్పించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చినట్లే తెలుగు మీడియంలో చదువుకొన్నవారికి లేదా తెలుగుబాషపై మంచి పట్టుకలిగినవారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇచ్చినట్లయితే,అందరూ తెలుగు బాష నేర్చుకోవడానికి మొగ్గు చూపడం మొదలుపెడతారు. కనుక తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిజంగా అమలుచేయగలిగితే తెలుగు బాషకు మహోపకారం చేసినట్లే అవుతుంది. ప్రాధమిక స్థాయి పాఠశాలల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు ప్రతీ చోట తెలుగుకు పెద్దపీట వేయగలిగితే తెలుగు బాషకు మళ్ళీ తప్పకుండా పూర్వ వైభవం రాగలదు. 


Related Post