తెలంగాణా సంక్షేమం కోసం పరితపిస్తున్న బిహార్ ఐపిఎస్ అధికారి (2)

November 10, 2017


img

అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస తెలంగాణావాసులు ‘డయల్ యువర్ విలేజ్’ పేరిట ప్రతీవారం రాష్ట్రంలో వివిధ రంగాలలో ప్రముఖులతో మాట్లాడి తెలంగాణా రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం రాష్ట్ర జైళ్ళ శాఖ డైరెక్టర్ శ్రీ వికె సింగ్ గారితో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ రెండవ భాగం వివరాలు: 

“ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటే ప్రజలలో కూడా మార్పు, సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత చాలా అవసరం. ఈ ఆలోచనలతోనే మేము సుమారు 8 నెలల క్రితం ‘సిటిజన్ ఫోరం’ను స్థాపించాము. సిటిజన్ ఫోరం అంటే రాజకీయ వేదిక కాదు.. కేవలం ప్రజల గొంతు వినిపించడానికి ప్రజలతో ఏర్పాటు చేసుకొన్నదే కనుక దీనిలో పదవులుండవు. డబ్బు, అధికారాలు అసలే ఉండవు. కార్యాలయం కూడా ఉండదు. దీనిని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఒక్కొక్కదానిలో 20 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాము. ఇప్పటికే మేము రాష్ట్రంలో 520 మండలాలలో కమిటీల ఏర్పాటు చేసుకొన్నాము. మున్ముందు అన్ని గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాము.” 

“మా ఆశయాలు చాలా గొప్పవే కానీ చాలా కటినమైనవి..ఆచరణలో పెట్టడానికి చాలా కష్టపడాలి. అది ఒకటో రెండో ఏళ్ళలో పూర్తయ్యేది కూడా కాదు. మా ప్రయత్నాలు ఫలించడానికి దశాబ్దాలు పట్టవచ్చు కానీ ఆలాగని నిరాశ చెంది ఎవరూ ఎప్పుడూ ప్రయత్నమే చేయకపోతే ఈ సమస్యలన్నీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాయి పైగా క్రమంగా ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి. అందుకే మేము చిన్నగా ఈ ప్రయత్నం మొదలుపెట్టాము. మా కార్యాచరణకు ప్రస్తుతానికి మూడు దశలలో అమలుచేయాలని నిర్ణయించుకొన్నాము.” 

“దానిలో మొదటి దశలో గ్రామీణ ప్రజల మద్య వివాదాలు ఏర్పడినప్పుడు వాటిని గ్రామస్థాయిలో పరిష్కరించుకొనేందుకు మా గ్రామస్థాయి సిటిజన్ ఫోరం సభ్యులు కృషి చేస్తారు. అలాగే గ్రామాలలో పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడేందుకు అవసరమైన కృషి చేయడం, పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించేలా వారి తల్లితండ్రులను ఒప్పించడం, గ్రామాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు.”

“రెండవ దశలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గల వివిధ వ్యవస్థల పనితీరును నిశితంగా పరిశీలిస్తూ, లోపాలున్నట్లయితే తక్షణం పైఅధికారులకు తెలియపరిచి వాటిని చక్క దిద్దించడం చేయాలనుకొంటున్నాము. ఉదాహరణకు ఇంచుమించు మనకు చాలా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో లేక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఉన్నాయి. కానీ వాటి ఉద్యోగులు విధులకు హాజరుకాకపోవడం, హాజరైనా విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ఆ సమస్య తమది కాదన్నట్లు అందరూ వ్యవహరిస్తుంటారు. ఒక్కసారి మనం ధైర్యం చేసి గట్టిగా ప్రశ్నిస్తే 80 శాతం సమస్యలు సులువుగా పరిష్కారం అయిపోతాయి. కానీ ఎవరూ పట్టించుకొము. కనుక ఆ సమస్య అలాగే ఉండిపోతుంది...దాని వలన ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉంటారు.”

“ఇక మిగిలిన 20 శాతం సమస్యలను పైఅధికారులకు దృష్టికి తీసుకువెళితే తప్పకుండా పరిష్కారం అవుతాయి. కానీ ఎవరో ఒకరు వెళ్ళి ప్రశ్నించినా, పై అధికారికి పిర్యాదు చేయాలనుకొన్నా సరైన స్పందన ఉండదు. కనుక కొంతమంది కలిసి ఒక బృందంగా ఏర్పడి సమస్యలపై ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడే సరైన స్పందన లభిస్తుంది. అందుకే మేము గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 20 మంది సభ్యులతో సిటిజన్ ఫోరం కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాము. అయితే అది కూడా అంత సులువైన పనికాదని ఆచరణలో తెలుసుకోగలిగాము. అలాగని మా ప్రయత్నాలు నిలిపివేయలేదు.”

“మూడవ దశలో ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేయాలని నిర్ణయించుకొన్నాము. ఈ దశలో ప్రజలను చైతన్యపరిచి, అభ్యర్ధుల కులమతప్రాంతాలు, పార్టీలను బట్టి కాకుండా వారి అర్హత, గుణగణాలను మాత్రమే చూసి ఓట్లు వేయాలని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తాము. మా ఈ ఆశయాలన్నీ ఆచరణలో పెట్టడం చాలా కష్టమే కానీ వాటిని సాకారం చేసుకోవాలనుకొంటే ముందుగా  ప్రయత్నం చేయడం కూడా అవసరమే కనుక ఈ మహా యజ్ఞాన్ని మొదలుపెట్టాము,” అని వికె సింగ్ అన్నారు.  

సశేషం..

ఇంటర్వ్యూ మొదటి భాగం లింక్: http://www.mytelangana.com/telugu/editorial/9404/sri-vk-singh-interview-given-to-dial-your-village  

మీరు ఈ చర్చ ఆడియో సంభాషణ వినాలనుకుంటే, ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి:

 https://fccdl.in/8xoQjFBiy  

డయల్ యువర్ విల్లేజ్ face book లింక్ :

https://www.facebook.com/groups/821757117915265/ 


Related Post