ప్రముఖ ఒగ్గుకధ కళాకారుడు చుక్క సత్తయ్య మృతి

November 09, 2017


img

తెలంగాణా జానపద కళారూపాలలో ఒకటైన ‘ఒగ్గుకధ’ కు మళ్ళీ గుర్తింపు తీసుకువచ్చిన చుక్క సత్తయ్య గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయిన చుక్క సత్తయ్యను ఒగ్గుకధకు ‘పితామహుడు’ గా గౌరవం పొందారు. పౌరాణిక, చారిత్రిక, వర్తమాన సామాజిక అంశాలను దేనినైనా ఒగ్గుకధా రూపంలోకి మలిచి అందరినీ ఆకట్టుకొనేలాగ చెప్పగల నేర్పుగలవారు చుక్కా సత్తయ్య. ఆయన రామాయణ, మహాభారత, మహాభాగవతాలను  ఒగ్గుకధగా చెపుతుంటే ఎవరూ ముందుకు కదలలేరు. అయన వాటిని చెప్పే తీరు అంత అద్భుతంగా ఉంటుంది. 

చుక్క సత్తయ్య చెప్పిన ఒగ్గుకధలలో రామాయణం, భక్త ప్రహ్లాద, గయోపాఖ్యానం, భస్మాసుర వధ, కంస వధ, మయసభ, బాల నాగమ్మ కథ, సత్యహరిశ్చంద్ర కథ, కాంభోజరాజు కథ,రంభ రంపాలా, గౌడ పురాణం, సిరికొండ మహారాజు కథ, సమ్మక్క కథ, ఎర్రగొల్ల అక్కమ్మకథ, ఎల్లమ్మకథ, నల్ల పోచమ్మ కథ, కనకతార కథ, సత్యవతి కథ, మండోదరి కథ, అల్లిరాణి కథ, మాందాలు కథ, మల్లన్నకథ, పెద్దిరాజు కథ, బీరప్ప కథ, సూర్యచంవూదాదుల కథ, కీలుగుర్రం కథ, అయిదు మల్లెపూల కథ, ఇప్పరాపురిపట్నంకథ, లక్ష్యాగృహం కథ మొదలైనవి చాలా ప్రసిద్దమైనవి. తెలంగాణా గ్రామీణ ప్రజలలో అనేకమంది ఆయన నోట వాటిని విని ఆనందించినవారే.    

చుక్క సత్తయ ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తం అనేక రాష్ట్రాలలో సుమారు 12,000 కళా ప్రదర్శనలు ఇచ్చిన ఘనుడు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ ఆయన ఒగ్గుకధ ప్రదర్శనను చూసి చాలా మెచ్చుకొని సన్మానించారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అయన 2004లో సంగీత నాటక అకాడమీ అవార్డు, రూ.50 వేలు నగదు బహుమతి అందుకొన్నారు. ఈ రంగంలో చుక్క సత్తయ్య చేసిన విశేష కృషిని గుర్తించిన కాకతీయ యూనివర్సిటీ 2005లో ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. అయన మలేసియాలో కూడా ప్రదర్శనలు ఇచ్చి మెప్పించారు. ఆయన ప్రతిభకు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకొన్నారు. విశేషమేమిటంటే అయన కేవలం ఒకటవ తరగతి వరకు మాత్రమే చదువుకొన్నారు. కానీ పొట్టి శ్రీరాములు ఎలుగు విశ్వవిద్యాలయంలో కళావిభాగంలో ఎంఏ స్థాయి విద్యార్ధులకు ఒగ్గుకధతో సహా వివిధ జానపద కళారూపాల గురించి పాఠాలు చెప్పేవారు. అయన సుమారు 20 ఏళ్ళు ఉపాద్యాయుడిగా పనిచేశారు.   

చుక్క సత్తయ్యగారి స్వస్థలం వరంగల్ జిల్లాలో లింగాల ఘనపురం మండలంలో మాణిక్యపురం గ్రామం. 11 ఏళ్ళ వయసులోనే పెళ్లి కూడా జరిగిపోయింది. 14వ ఏటి నుంచే ఒగ్గుకధ చెప్పడంలో నేర్పు సంపాదించారు. అయన తనతోటే ఈ ఒగ్గుకధ కాలారూపం అంతరించిపోకూడదనే ఉద్దేశ్యంతో జనగామలో జ్యోతిర్మయి లలిత కళా సమితిని ఏర్పాటు చేశారు. దానిలో అనేకమందికి ఒగ్గుకధలో శిక్షణ ఇచ్చారు. వివిధ జానపద కళలలో ఆసక్తి చూపేవారిని ప్రోత్సహించేవారు. 

ఒకమారు మూల గ్రామంలో పుట్టి, నిరక్షరాస్యుడైన ఒక వ్యక్తి ఇన్ని సన్మానాలు, ఇన్ని అవార్డులు, ఇంత గుర్తింపు పొందడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఎంతో ఉన్నత చదువులు చదువుకొన్నవారు కూడా సాధించలేని ఘనవిజయాలు చుక్క సత్తయ్య సాధించారు. ఆయన వంటి గొప్ప కళాకారుడిని కోల్పోవడం నిజంగా తెలంగాణా రాష్ట్రానికి తీరని లోటేనని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు అయన మృతికి సంతాపం తెలిపారు.


Related Post