దానికీ కొట్లాట ఎందుకు?

November 07, 2017


img

తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నడూ లేనివిధంగా వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని మంత్రులు చెపుతుంటారు. అధికారంలోకి వస్తే లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మూడున్నరేళ్ళలో కేవలం 30-40,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి ప్రభుత్వం మాయమాటలతో నిరుద్యోగులను మభ్యపెడుతోందని ప్రతిపక్షాలు, తెలంగాణా రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వాదిస్తుంటారు. ఆయన మేధావి ముసుగులో కాంగ్రెస్ ఏజంట్ లాగ వ్యవహరిస్తూ ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రులు ఆరోపిస్తున్నారు. 

ఈ వాదోపవాదాలు సుమారు ఒక ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. నిరుద్యోగుల ర్యాలీ, కొలువుల కొట్లాట..అంటూ ప్రొఫెసర్ కోదండరాం ఏదో ఒక నిరసన కార్యక్రమాలు ప్రకటించడం, తెరాస సర్కార్ వాటిని పోలీసుల చేత అడ్డుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే, దీనిలో ప్రధాన సమస్య అయిన ‘ఉద్యోగాల భర్తీ’ అంశం పక్కకు పోయి దాని స్థానంలో రాజకీయ కోణమే ఎక్కువగా కనిపిస్తోందిపుడు. 

ప్రొఫెసర్ కోదండరాం పోరాటం కేవలం ఉద్యోగాల భర్తీ కోసమే అయితే అయన నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కానీ అయన ఆ పేరుతో ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించాలనుకోవడం తప్పు కాదు గానీ అదే అనుమానాలు కలిగిస్తున్నాయి. ఆయన ‘కొలువులు కొట్లాట’ పేరుతో బహిరంగ సభ జరుపుకోవాలనుకొన్నారు. కానీ యధాప్రకారం పోలీసులు అందుకు అనుమతించకపోవడంతో దాని కోసం అయన హైకోర్టును ఆశ్రయించగా ఆ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 

ఇక ఉద్యోగాల భర్తీ హామీ అమలు విషయంలో తెరాస సర్కార్ కొంత వెనుకబడి ఉన్నమాట వాస్తవం. అయితే అదేమీ నేరం కాదు. ప్రభుత్వం అంటే ఉద్యోగాలు కల్పించే కర్మాగారం కాదు. దాని ప్రధాన బాధ్యత పరిపాలనే తప్ప ఉద్యోగాల భర్తీ కాదు. ప్రభుత్వంలో వివిధ వ్యవస్థలలో అనేక వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. ప్రభుత్వ పనులను చేయడానికి వారు అవసరం కనుకనే వారిని ప్రభుత్వం నియమించుకొంటుంది తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి కాదు. ఆ ఉద్యోగాలు ఖాళీలున్నప్పుడు లేదా ఏర్పడినప్పుడు వాటిని తిరిగి భర్తీ చేస్తుంటుంది. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. కనుక తెరాస హామీ ఇచ్చింది కనుక లక్షన్నర..రెండు లక్షల మందికి తక్షణమే ఉద్యోగాలు కల్పించమని డిమాండ్ చేయడం సరికాదనే చెప్పాలి. 

ఇక ప్రభుత్వ వ్యవస్థలలో ఒక ఉద్యోగిని నియమించుకోవడం ప్రైవేట్ సంస్థలో నియమించుకొన్నంత తేలిక కాదని ప్రొఫెసర్ కోదండరాంకు కూడా తెలుసు. దానికి సుదీర్ఘమైన ప్రక్రియ..మళ్ళీ మద్యలో దానిపై కూడా కోర్టులో న్యాయపోరాటాలు అనివార్యంమైపోయాయి. ఒక ఉద్యోగిని నియమించుకోవడం అంటే అతను లేదా ఆమెకు ఉద్యోగంలో చేరిన మొదటిరోజు నుంచి పదవీ విరమణ చేసేవరకు, ఆ తరువాత కూడా జీతాలు, ఇంక్రిమెంట్లు, బోనసులు, పీఎఫ్, పెన్షన్లు వంటి చాలా ఆర్ధికభారం ప్రభుత్వంపై ఉంటుంది. కనుకనే ఉద్యోగాల భర్తీ విషయంలో ఏ ప్రభుత్వమైనా తనకు అవసరమైన మేరకే చాలా ఆచితూచి నియామకాలు చేసుకొంటుంది. కనుక ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి లేదు. (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా జీతాలు పెంచుకోవడం లేదా? రాజకీయ నిరుద్యోగులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించేందుకు శాసనసభ స్థానాలు పెంచాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేయడం లేదా? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది వేరే విషయం).

ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు కల్పించడం అసాధ్యం కనుకనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో అనేక పరిశ్రమలు, ఐటి, వ్యాపార సంస్థల ఏర్పాటు చేయడానికి తీవ్ర కృషి చేస్తోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ప్రైవేట్ రంగంలో బారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఈ విషయాలన్నీ ప్రొఫెసర్ కోదండరాంకు తెలియవనుకోలేము. అయినా యువతకు ప్రభుత్వోద్యోగాలే కల్పించాలని డిమాండ్ చేస్తున్నందున అనుమానించవలసి వస్తోంది. అదే ఆయన నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇమ్మని డిమాండ్ చేసే బదులు వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపించమని డిమాండ్ చేస్తే సహేతుకంగా ఉంటుంది. అప్పుడు యువతే అనేక మందికి ఉద్యోగాలు కల్పించగల స్థాయికి ఎదుగుతారు కదా?


Related Post