కష్టం ప్రభుత్వానిది..కాసులు కార్పోరేట్ కాలేజీలది

November 04, 2017


img

రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమూల గ్రామాలలో సైతం ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అటు ఉపాద్యాయులు, ఇటు ప్రభుత్వమూ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మారుమూల గ్రామాలలో ఉండే విద్యార్ధులను వాటిలో చేర్పించి ఉత్తమ విద్యార్ధులుగా తీర్చి దిద్దుతున్నారు. ఏపిలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుల తపన చూస్తే ఎవరైనా ముగ్ధులు కాకమానరు. తమ పాఠశాలకు పొరుగునే ఉన్న గ్రామంలోని పెద్దలను ఒప్పించి వారి పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి వారు ఒక్కొక్కరూ రూ.1,000 చొప్పున చందాలు వేసుకొని ఆటోను ఏర్పాటు చేశారు. అది వారి తపనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో కూడా అనేక ప్రభుత్వ పాఠశాలలలో ఉపాద్యాయులు ఇరుగుపొరుగు గ్రామాలలో పిల్లలను తమ పాఠశాలలో చేర్పించుకోవడానికి ఇటువంటివే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోపక్క ప్రభుత్వం కూడా పాఠశాలలలో లైబ్రేరీలు, డిజిటల్ క్లాస్ రూమ్స్, స్వచ్చమైన త్రాగునీరు, టాయిలెట్లు, ప్లే గ్రౌండ్స్ వంటి మౌలికవసతులు కల్పించడానికి ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం పెట్టించి మంచి అనుభవజ్ఞులైన ఉపాద్యాయులచేత పాఠాలు చెప్పిస్తోంది. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో కూడా ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 

చదువులతో పాటు విద్యార్ధులకు ఆటపాటలు, వ్యాయామాలు ఉంటాయి. ఇప్పుడు అనేక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఆడుకోవడానికి మంచి మైదానాలు, పచ్చటి మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకొంటుంటే, వేలు, లక్షల రూపాయలు ఫీజులు కట్టినా ప్రైవేట్ పాఠశాలలో పిల్లలకు సుఖం ఉండటంలేదు. లక్షలు పోసినా ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలలో ఉచితంగా భోజనం పెట్టరు..ఆటలు, వ్యాయామం వంటి మాటలు కూడా వినబడవు.

చాలా ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలకు అసలు మైదానాలే ఉండవు. అత్యంత రద్దీగా ఉండే రోడ్ల పక్కన అపార్ట్మెంట్ లలో నడుస్తున్నవి చాలానే కనిపిస్తాయి. వాటిలో చదివే పిల్లలపై బాల్యం నుంచే ఒత్తిడి మొదలవుతుంది. వారు 5,6 తరగతులకు వచ్చేసరికే వారిపై ఇంజనీరింగ్, ఐఐటి, డాక్టర్ చదువులకని రకరకాల ఒత్తిళ్ళు మొదలైపోతున్నాయి. 10వ తరగతి వచ్చేసరికి అవి పతాకస్థాయికి చేరుకొని విద్యార్ధులను మానసికరుగ్మతల పాలు చేస్తున్నాయి. ఇక ఇంటర్, డిగ్రీ స్థాయికి వచ్చేసరికి కాలేజీ యాజమాన్యపు ఒత్తిళ్ళు భరించలేక విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొంటున్న ఘటనలను మనం తరచూ చూస్తూనే ఉన్నాము. కానీ కార్పోరేట్ కాలేజీలే పైసలు సంపాదించుకొంటున్నాయి..తమ గురించి గొప్పగా ప్రచారం చేసుకొంటున్నాయి. 

ఒకపక్క ప్రభుత్వమూ, ఉపాద్యాయులు అనేక వ్యయప్రయాసలకోర్చి ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలను చేర్పించుకొని వారిని ఉత్తమ విద్యార్ధులుగా, చక్కటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతుంటే వారిలో మంచి ప్రతిభావంతులను, అత్యుత్తమ మార్కులు సాధించిన వారిని కార్పోరేట్ కాలేజీలు కాకుల్లా ఎగరేసుకొనిపోతున్నాయి. అంటే కష్టం, ఖర్చు ప్రభుత్వానిది, ఉపాద్యాయులది, కాసులు, కీర్తి ప్రతిష్టలు కార్పోరేట్ కాలేజీలకి దక్కుతున్నాయని అర్ధం అవుతోంది. కనుక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని బాగా రాణిస్తున్న విద్యార్ధులను కార్పోరేట్ కాలేజీలు ఎగరేసుకొని వెళ్ళిపోకుండా ప్రభుత్వం అరికట్టగలిగితే ఆ విద్యార్ధుల వలన ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు, తద్వారా ప్రభుత్వానికి కూడా మంచిపేరు సంపాదించిపెట్టగలరు. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం పడిన శ్రమ, చేసిన ఖర్చుకు సరైన ఫలితం దక్కుతుంది.  


Related Post