అది గర్వించవలసిన విషయమా?

November 02, 2017


img

ఒకప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు టికెట్స్ కోసం పార్టీలు మారుతుండేవారు. వారిపట్ల ప్రజలలో చాలా చులకనభావం వ్యక్తం అయ్యేది. కానీ ఇప్పుడు పార్టీల అధినేతలే ఇతర పార్టీల నేతలను, కార్యకర్తలను నయాన్నో, భయన్నో తమ పార్టీలోకి ఫిరాయింపజేస్తున్నారు. అప్రజాస్వామికమైన, నీతి బాహ్యమైన ఈ ఫిరాయింపుల కార్యక్రమానికి ‘రాజకీయ పునరేకీకరణ’ అనే అందమైన ముసుగు కూడా తొడిగారు. ఒక్కో పార్టీ ఇతర పార్టీలకు చెందినవారిని ఎంతమందిని చేర్చుకొంటే అంత గొప్ప అన్నట్లు నిసిగ్గుగా మాట్లాడుతున్నాయి. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు. అన్ని పార్టీలు ఈ పోటీలో నిసిగ్గుగా పాల్గొంటున్నాయి.

 ఇటీవల రేవంత్ రెడ్డి తెదేపాను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనతో బాటు మరికొంత మందిని కాంగ్రెస్ లోకి వెంటతీసుకుపోయారు. ఇంతకాలం తమను విమర్శించిన రేవంత్ రెడ్డి పార్టీలోకి వస్తుంటే నిరాకరించి ఉండాలి కానీ ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించడమే గొప్ప ఘనకార్యం అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరించడం అందరూ చూశారు. 

రేవంత్ రెడ్డి తెదేపాను వీడగానే, తెరాస కూడా తెదేపాలో ద్వితీయశ్రేణి నేతలను, కార్యకర్తలను హడావుడిగా తమ పార్టీలోకి ఫిరాయింపజేయడం అందరూ చూశారు. ‘త్వరలోనే ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి బారీగా వలసలు ఉంటాయని’ భాజపా గత రెండు మూడు నెలలుగా గొప్పగా చెప్పుకొంది. కానీ ఈ ఫిరాయింపు రేసులో అది వెనుకబడిపోయింది. అందుకు అది బాధపడుతున్నట్లు ఆ పార్టీ నేతల మాటలను బట్టి అర్ధం అవుతోంది. ఇప్పుడు అన్ని పార్టీలు ఫిరాయింపులకు కూడా టార్గెట్స్ పెట్టుకొని మరీ పనిచేస్తున్నందుకు నవ్వాలో ఏడ్వాలో తెలియని పరిస్థితి. 

ప్రతీ రాజకీయ పార్టీకి వేర్వేరు ఆశయాలు, సిద్దాంతాలు ఉన్నాయి. అయితే తమ ప్రత్యర్ధులను చావు దెబ్బ తీసి ఎన్నికలలో గెలవడమే ఏకైక సిద్దాంతంగా అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి కనుక వాటి ఆశయాలు, సిద్దాంతాలు ఈ ఫిరాయింపులకు అడ్డుగా భావించడం లేదు. ఒకప్పుడు రాజకీయ నేతలు ప్రజలు ఏమనుకొంటారో అనే భయంతో తాము ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు అధికారమే తమ ఏకైక లక్ష్యమని నిసిగ్గుగా చెప్పుకొంటున్నాయి. 

ఏ రాజకీయ పార్టీ అయినా దాని ఆశయాలు, సిద్దాంతాలు పునాదిగా పార్టీని నిర్మించుకొంటే అది కలకాలం దృడంగా నిలబడుతుంది. కానీ ఇలాగ అవకాశవాద రాజకీయనాయకులతో పార్టీని, ప్రభుత్వాన్ని, అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అప్పుడు దాని కోసం ఇంకా తప్పుడు మార్గాలలో ప్రయాణించక తప్పదు. 

ఒక మంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇటువంటి అవలక్షణాలన్నీ అంటించితే చివరికి నష్టపోయేది రాజకీయ నాయకులే..వారి పార్టీలేనని మరిచిపోకూడదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మన కళ్ళ ముందు తెదేపా ఉంది. ఈరోజు తెదేపా నష్టపోతోంది..రేపు కాంగ్రెస్..ఆ తరువాత తెరాస వంతుకావచ్చు. కనుక రాజకీయ పార్టీలు, వాటి నేతలు ప్రజాస్వామ్య విధానాలను, వాటి విలువలను చేజేతులా నాశనం చేయాలని ప్రయత్నించకుండా ఉంటే వారికే మంచిది.  


Related Post