ఇంత అసహనం ఎందుకో?

October 27, 2017


img

ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో, సినిమాలలో..సమాజంలో వివిధ వ్యవస్థలపై లేదా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజాభిప్రాయాన్ని అద్దంపట్టడం సహజం. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా తమ స్వంత అభిప్రాయాన్ని, ప్రజాభిప్రాయాన్ని తెలియజేసేందుకు దీక్షలు, ధర్నాలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలు చేయడం మన ప్రజాస్వామ్యవ్యవస్థలో భాగమే. కానీ గత కొన్నేళ్ళుగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో అసహనం పెరుగుతున్న దాఖలాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 

తెలంగాణా రాష్ట్రానికి సంబందించి, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ధర్నాచౌక్ ఎత్తివేయవద్దని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రొఫెసర్ కోదండరామ్ తలపెట్టిన ‘తెలంగాణా అమరవీరుల స్పూర్తియాత్ర’ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకొంటోందో...దాని వలన రాష్ట్రానికి ఏమి నష్టం జరుగుతోందో తెలియదు. దాని కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. 

ఇక పొరుగునే ఉన్న ఏపిలో ముద్రగడ పద్మనాభం పాదయాత్రలకు తెదేపా సర్కార్ అనుమతించకపోవడాన్ని కూడా ఈవిధంగానే చూడకతప్పదు. ఆయన కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయన రాజకీయ ఉద్దేశ్యంతోనే పాదయాత్రలకు పూనుకొంటున్నారనేది బహిరంగ రహస్యం. అయితే ఆయన ఏ కారణాల చేత పాదయాత్ర చేస్తున్నప్పటికీ దానిని ప్రభుత్వం అడ్డుకోనవసరం లేదు. “ఒక పౌరుడుగా పాదయాత్రలు చేసుకోవడం తప్పయితే, మరి ఆనాడు చంద్రబాబు ఎందుకు పాదయాత్ర చేశారు? ఆయనను ఎందుకు అనుమతించారు?” అని ముద్రగడ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు సమాధానం రాలేదు.  

ఇక తమిళ హీరో విజయ్ నటించిన తాజా తమిళ చిత్రం ‘మెర్సిల్’ లో జి.ఎస్.టి.లో లోపాలను ఎత్తిచూపుతూ డైలాగ్స్ ఉన్న కారణంగా వాటిపై ఆ రాష్ట్రంలో భాజపా ఆందోళన కార్యక్రమాలు చేస్తోంది. అదే సినిమాను ‘అదిరింది’ పేరుతో తెలుగులో విడుదల చేయబోతే, దానికి సెన్సార్ బోర్డ్ అడ్డుపడటంతో నేడు రిలీజ్ కావలసిన ఆ సినిమా వాయిదా పడింది. ఆ సినిమాలో జి.ఎస్.టి.పై డైలాగులు తొలగిస్తే కానీ లేదా వాటికి ‘బీప్ సౌండ్’ తో వినబడకుండా చేస్తేగానీ అనుమతించమని సెన్సార్ బోర్డు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనలన్నీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో నానాటికీ పెరుగుతున్న అసహనాన్ని పట్టి చూపిస్తున్నాయి. మెర్సెల్ చిత్రంలో జి.ఎస్.టి. గురించి తమ  అభిప్రాయాన్ని చెప్పి..అందులో లోపాలను ఎత్తి చూపిస్తే వాటిని కేంద్రప్రభుత్వం సవరించుకొనే ప్రయత్నం చేస్తే హుందా ఉండేది..లేదా కనీసం మౌనంగా ఊరుకొన్నా సరిపోయేది కానీ దానిని భాజపా ద్వారా అడ్డుకొంటోంది. 

ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సహనంతో వ్యవహరిస్తే బాగుండేది. కానీ “మా పాలనను, మా విధానాలను ఎవరూ తప్పు పట్టడానికి వీలులేదు...మేము చెప్పిందే వేదం...దానిలో ఎన్ని లోపాలు కనబడుతున్నా వాటిని నిశబ్దంగా భరించాల్సిందే తప్ప ఎవరూ ప్రశ్నించకూడదు...అభ్యంతరాలు చెప్పకూడదు..” అనే ధోరణి ప్రభుత్వాలలో కనబడుతోంది. ఈ ధోరణి చూస్తుంటే మళ్ళీ అలనాటి రాజులు, నవాబుల నియంతృత్వ పాలనవైపు దేశాన్ని నడిపిస్తున్నట్లుంది. అందుకే దేశంలో మేధావులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. 

అధికారంలో ఉన్నవారు దేశంలో, రాష్ట్రంలో ఒక ఆరోగ్యకరమైన, అందరికీ ఆమోదయోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పాలి తప్ప అధికారం ఉంది కదాని నియంతృత్వపోకడలుపోతే, వారిపాలన ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఈ ఒక్క కారణం చేతనే ప్రభుత్వాల పట్ల, వాటిని నడిపిస్తున్న పార్టీలపట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని మరిచిపోకూడదు. ఈ అభిప్రాయంతో ఏకీభవించలేనివారు ఒకసారి చరిత్ర చూస్తే అనేక ఉదాహరణలు కనబడతాయి. చివరిగా ఒక్క ముక్క చెప్పుకోవాలి. సూర్యుడిని చూడటం ఇష్టం లేదని తలుపులు..కిటికీలు మూసుకొని కూర్చోన్నంత మాత్రాన్న సూర్యప్రకాశాన్ని ఎవరూ అడ్డుకోలేరు..ఆపలేరు. ఇవీ అంతే!

ఇది చదివారా? టిటిడిపి మ్యాచ్..నేడే ఫైనల్స్?


Related Post