తమిళనాడులో మళ్ళీ హడావుడి షురూ

March 23, 2017


img

తమిళనాడులో అధికార అన్నాడిఎంకె పార్టీలో గత 4-5 నెలలుగా సాగిన రాజకీయాలను చూస్తే ఆ పార్టీలో నేతలందరూ ఒకరిని మించినవారొకరని అర్ధం అవుతుంది. కానీ విచిత్రం ఏమిటంటే శశికళ, పన్నీర్ సెల్వం మద్య జరిగిన ఆధిపత్యపోరులో ఇద్దరూ ఓడిపోయారు. ఆమె జైలుకు వెళ్ళేముందు పళనిస్వామిని ముఖ్యమంత్రి చేసిపోతే అయన ఇంతవరకు ఒక్కసారి కూడా బెంగళూరు జైలులో ఉన్న ఆమెను పలకరించడానికి వెళ్ళలేదు. 

ఆమె జైలుకు వెళ్ళిపోవడంతో పన్నీర్ సెల్వం ఇప్పుడు పళనిస్వామితో రాజకీయ యుద్ధం ప్రారంభించారు. ‘అన్నాడిఎంకె పార్టీ మాదంటే మాదని’ ఇద్దరూ కీచులాడుకొంటూ ఎన్నికల కమీషన్ వద్ద పంచాయితీ పెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో స్వర్గీయ జయలలిత ప్రాతినిద్యం వహించిన ఆర్ కె నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు (ఏప్రిల్ 12) రావడంతో అన్నాడిఎంకె పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ఎవరికీ ఇవ్వకూడదనే ఎన్నికల కమీషన్ నిర్ణయం పళనిస్వామి ప్రభుత్వానికి పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. 

జయలలితకు, ఆమె పార్టీకి తామే అసలైన వారసులమని చెప్పుకొంటున్న పళనిస్వామి వర్గం ఆ విషయాన్ని ఈ ఉపఎన్నికలలో గెలవడం ద్వారా నిరూపించుకోవాలనుకొంది. కానీ ఎన్నికల కమీషన్ తీసుకొన్న ఈ నిర్ణయం వలన కీలకమైన ఈ ఉపఎన్నికలలో ప్రజలందరికీ చిరపరిచితమైన రెండాకులు గుర్తుతో కాకుండా వేరే గుర్తుతో పోటీ చేయవలసిరావడం దానికి ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. పైగా జయలలితకు తానే అసలైన వారసురాలినని చెప్పుకొంటున్న ఆమె మేనకోడలు దీపా జయకుమార్  అక్కడి నుంచే పోటీ చేయబోతుండటం, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ భాజపా తరపున పోటీ చేస్తుండటం, ఆయనకు ప్రముఖ నటుడు రజనీకాంత్ బహిరంగంగా మద్దతు ప్రకటించడం వంటివన్నీ అన్నాడిఎంకె పార్టీకి ప్రతికూలాంశాలే. 

ఒకవేళ ఈ ఉపఎన్నికలలో పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన అభ్యర్ధి గెలిచినట్లయితే ఆయనకే ప్రజాధారణ ఉన్నట్లు నిరూపితం అవుతుంది కనుక ఇంక అయన కూడా దూకుడుగా వ్యవహరించవచ్చు. భాజపా అభ్యర్ధి గెలిచినట్లయితే, ఆ రాష్ట్రంలో భాజపాకు అదే మొదటి అడుగు అవుతుంది. అప్పుడు రజనీకాంత్ ను కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలవవచ్చు.      



Related Post