రాజమౌళి సృష్టించిన బాహుబలికి జానారెడ్డి మంచి ప్రచారం కల్పించారని చెప్పవచ్చు. ఆయన ఆ ముక్క వదిలిన తరువాతే తెరాస, కాంగ్రెస్, భాజపా, వామపక్షాలలో కూడా చాలా మంది బాహుబలులు ఉన్న సంగతి బయటపడింది. కానీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క బాహుబలి లేడు..కాటమరాయుడు లేడని తేలికగా కొట్టి పడేశారు.
ఆ తరువాత ప్రొఫెసర్ కోదండరామ్ గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ “ఆయన రాజకీయ పార్టీ పెడతారనుకోవడం లేదు. ఒకవేళ పెట్టినా మా పార్టీకి ఎటువంటి అభ్యంతరం, నష్టం ఉండదు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయం. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎన్నికల ఫలితాలను నిశితంగా చూసినట్లయితే, ఆ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారని అర్ధం అవుతోంది. కనుక వచ్చే ఎన్నికలలో తెలంగాణా ప్రజలు కూడా తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా, దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ప్రజలు తెరాస సర్కార్ నిరంకుశ, అప్రజాస్వామిక పాలనతో విసుగెత్తిపోతున్నారు,” అని మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
'ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్' అని తెరాస నేతలు చేస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని ఆయనతో తమకు సంబంధం లేదన్నట్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారేమోననే అనుమానం కలుగుతోంది. ఆయన పార్టీ పెట్టుకొంటే మాకేమీ అభ్యంతరం లేదని మంత్రి కేటిఆర్ అన్నట్లే, భట్టి కూడా అనడం అందుకేనేమో. ఏమైనప్పటికీ ప్రొఫెసర్ కోదండరామ్ టిజెఎసిలోనే కొనసాగుతారా లేక కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేక స్వంతంగా పార్టీ పెట్టుకొంటారా లేదా వేరే ఏ పార్టీలోనైనా చేరుతారా...అనేది మరొక ఏడాదిలోపుగానే తేలిపోవచ్చు.