కోదండరామ్ కు ఆ పార్టీ నుంచి ఆహ్వానం?

March 02, 2017


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదనే విషయంలో అనుమానం లేదు. ఒకవేళ ఉండి ఉంటే 2014 ఎన్నికలలోనే తెరాస టికెట్ పై పోటీ చేసి ఉండేవారు. కానీ తెరాస సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అయన దానిని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమని భావిస్తున్నారు. ఆమాద్మీ తరహాలో రాజకీయ పార్టీని స్థాపించే ఆలోచన ఉందని చాలాసార్లు చెప్పారు కానీ ఇంతవరకు నిర్దిష్టమైన ప్రయత్నమేదీ చేయలేదు. 

ప్రజాకవి గద్దర్ కూడా ఒక రాజకీయ పార్టీ స్థాపించాలనుకొంటున్నారు. కానీ ఇలాగ ఎవరికివారు వేర్వేరుగా పార్టీలు స్థాపించుకోవడం కంటే అందరూ కలిసి ఒకే పార్టీ స్థాపించడం మంచిదనే ఆలోచనతో తెలంగాణా ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో జూన్ 2న ఒక కొత్త పార్టీని స్థాపించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. తాము స్థాపించబోతున్న ఆ కొత్త పార్టీలో చేరవలసిందిగా ప్రొఫెసర్ కోదండరామ్ ను ఆహ్వానిస్తూ తెలంగాణా ఉద్యమ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఒక లేఖ వ్రాశారు. 

మల్లనసాగర్ ప్రాజెక్టు భూసేకరణ మొదలు నిరుద్యోగ ర్యాలీ వరకు కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకొని, ఉద్యమ పార్టీలన్నీ కూడా అందుకు అనుగుణంగా తమ తీరును మార్చుకొని తెరాసను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ముందుకు సాగవలసిన అవసరం ఉందని ఆ లేఖలో వ్రాశారు. గద్దర్, తెలంగాణా రైతు జెఎసి చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్, అరుణోదయ విమల, బలహీన, దళిత, మైనార్టీ, విద్యార్ధి, ఉద్యోగ సంఘాల నేతలు చాలా మంది కొత్త పార్టీలో చేరేందుకు సానుకూలంగా స్పందించారని ఆ లేఖలో పేర్కొన్నారు. కనుక ప్రొఫెసర్ కోదండరామ్ కూడా తమతో చెయ్యి కలుపవలసిందిగా డాక్టర్ చెరుకు సుధాకర్ ఆహ్వానించారు

ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి కనుక ఈ కొత్త పార్టీకి వీలైనంత త్వరగా రూపురేఖలు కల్పించి ప్రజలలోకి వెళ్ళవలసిన అవసరం ఉందని డాక్టర్ సుధాకర్ అభిప్రాయపడుతున్నారు. కనుక ప్రొఫెసర్ కోదండరామ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లయితే వీలైనంత త్వరగా దానిపై స్పష్టత ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.. ప్రొఫెసర్ కోదండరామ్ కు కూడా అటువంటి ఆలోచన ఉంది కనుక ఈ కొత్త పార్టీలో చేరేందుకు సిద్దపడతారనే భావించవచ్చు. పైగా వారందరితో ఆయనకు సత్సంబంధాలున్నాయి.


Related Post