చైనాపై అమెరికా ఆగ్రహం భారత్‌కు వరంగా మారనుందా?

May 15, 2020


img

కరోనా మహమ్మారికి అగ్రరాజ్యం అమెరికా చాలా భారీ మూల్యం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు...కరోనా కేసులు, మరణాలు...లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడటంతో ఆర్ధిక సంక్షోభం....లక్షలాది మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోవడంతో నిరుద్యోగ సమస్య...సామాజిక సమస్యలు... ఇలా చెప్పుకొంటూ పోతే చాలా సమస్యలు, నష్టాలు, కష్టాలు అమెరికాను చుట్టుముట్టాయి. 

వీటన్నిటికీ ట్రంప్‌ అవగాహనా రాహిత్యం...నిర్లక్ష్యమేనని అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దాంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్‌ కూడా మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుక సహజంగానే డోనాల్డ్ ట్రంప్‌ దీనికంతటికీ మూలకారణమైన చైనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చైనాపై కటిన ఆంక్షలు, చర్యలు తీసుకోవడానికి సిద్దపడుతున్నారు. తద్వారా చైనాను ప్రపంచదేశాల ముందు, ముఖ్యంగా అమెరికన్ల ముందు దోషిగా నిలబెట్టేందుకు ట్రంప్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పవచ్చు. ఆ ప్రయత్నాలలో భాగంగానే సెనేటర్ టామ్ తిల్లీస్ 18 అంశాలతో కూడిన ఒక కార్యాచరణను ప్రకటించారు. 

దానిలో ముఖ్యమైనవి..చైనా ప్రాధాన్యం తగ్గించి మిత్రదేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం... చైనాలో ఉన్న ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక అమెరికన్ సంస్థలను అక్కడి నుంచి స్వదేశానికి లేదా భారత్‌ వంటి మిత్రదేశాలకు తరలించడం... చైనాకు అడ్డుకట్టవేయడానికి భారత్‌, జపాన్, తైవాన్, వియత్నాం వంటి దేశాలకు భారీగా అత్యాధునిక ఆయుధ సామాగ్రిని అందించడం, మిత్రదేశాలకు అవసరమైన టెక్నాలజీని, ఆర్ధికంగా సహాయసహకారాలు అందించడం వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

కనుక ఈ కార్యాచరణ భారత్‌కు చాలా కలిసి వస్తుందని వేరేగా చెప్పక్కరలేదు. బహుశః అందుకే ప్రధాని నరేంద్రమోడీ మొన్న తన ప్రసంగంలో స్వయంసంవృద్ధి సాధించడం, స్థానికంగా ఉత్పత్తి, పంపిణీ, వినియోగం చేసుకోవడం గురించి మాట్లాడారనుకోవచ్చు. అంతేకాదు...లక్షలాది సైనికులు వినియోగించే ఆర్మీ క్యాంటీన్లలో (వీటిలో నిత్యావసర సరుకులు, మద్యం, ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు వగైరాలు అమ్ముతారు) ఇకపై దేశీయంగా తయారైన ఉత్పత్తులనే విక్రయించాలని హోంశాఖ నిర్ణయించింది. అంటే భారత్‌లోకి చైనా దిగుమతులను అడ్డుకొనే యోచనలో కేంద్రం ఉన్నట్లు భావించవచ్చు. 

భారత్‌-అమెరికా మద్య ఎప్పటి నుంచో మంచి స్నేహసంబంధాలున్నాయి. ఫిబ్రవరిలో డోనాల్డ్ ట్రంప్‌ కుటుంబం భారత్‌ పర్యటన తరువాత ప్రధాని నరేంద్రమోడీ-డోనాల్డ్ ట్రంప్‌ల స్నేహం మరింత బలపడిందని అందరికీ తెలుసు. కనుక ఇకపై చైనాకు వెళ్ళాలనుకొన్న అమెరికన్ కంపెనీలు భారత్‌ దారి పట్టవచ్చు. భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టవచ్చు. చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు భారత్‌కు అమెరికా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే దాని వలన భారత్‌ చాలా లాభపడుతుంది. అయితే అమెరికాతో స్నేహం అంటే బాంబును జేబులో పెట్టుకొని తిరగటం వంటిదేనని చెప్పవచ్చు. దాని వలన ఎంత లాభం ఉంటుందో అంత నష్టం కూడా తప్పక ఉంటుంది. కానీ అందివచ్చిన ఈ అవకాశాన్ని భారత్‌ సద్వినియోగం చేసుకోగలిగితే భారత్‌కు ఇక తిరుగు ఉండదు.


Related Post