ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించిన నిర్మలా సీతారామన్

May 13, 2020


img

కరోనా...లాక్‌డౌన్‌ వలన దేశంలో దెబ్బ తిన్న అన్ని వర్గాలు, అన్ని రంగాలు కోలుకొని మళ్ళీ పూర్వస్థాయికి చేరుకొనేందుకుగాను రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రధాని నరేంద్రమోడీ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఆ ప్యాకేజీకి సంబందించి కొన్ని వివరాలను మీడియాకు తెలియజేశారు. వాటిలో ప్రధానాంశాలు: 

ప్రస్తుతం రూ.3 నుంచి రూ. 5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారికి 5 శాతం, రూ.5 నుంచి రూ.10 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి 20 శాతం, రూ.10 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి 30 శాతం టిడిఎస్‌ ఉండగా, 2020-21 ఆర్ధిక సంవత్సరాలలో ఆదాయపన్నులో టిడిఎస్‌లో గరిష్టంగా 25 శాతం మినహాయింపు ఇచ్చింది. దీని వలన సుమారు దేశవ్యాప్తంగా లక్షలాది ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు సుమారు రూ. 50,000 కోట్లు మేర లబ్ది కలుగనుంది. ఈనెల 14 నుంచి వచ్చే ఏడాయి మార్చి 31వరకు ఇది అమలులో ఉంటుంది. 2019-20 ఐ‌టి రిటర్న్స్ దాఖలుకు గడువును నవంబర్ 30వరకు పొడిగించింది.   

నెలకు రూ.15,000 లోపు జీతం పొందుతున్నవారికి జూన్, జూలై, ఆగస్ట్ నెలల పీఎఫ్ వాటాగా వారు చెల్లించాల్సిన మొత్తాన్ని కేంద్రప్రభుత్వమే చెల్లిస్తుంది. దీని కోసం కేంద్రప్రభుత్వం రూ.2,500 కోట్లు కేటాయించింది. ఈ మేరకు  సుమారు 70.22 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు.    

లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న సుమారు 2 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్లు రుణాలు పొందవచ్చు. వాటికి ప్రభుత్వమే గ్యారంటర్‌గా ఉంటుంది. 12 నెలల మారిటోరియంతో అందించబడే ఈ రుణాలను నాలుగేళ్ళలో తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు రుణాలు పొందవచ్చు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 45 లక్షల చిన్న, మద్య తరహా పరిశ్రమలు లబ్ది పొందుతాయి. దీనికి అదనంగా అత్యవసరాల కోసం మరో రూ.20,000 కోట్లు అందుబాటులో ఉంటాయి. వీటి ఈక్విటీ పెట్టుబడుల కోసం కేంద్రప్రభుత్వం రూ.50,000 కోట్లు కేటాయించింది. 

లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా పరిశ్రమలు, భారీగా విద్యుత్ వినియోగించే సంస్థలు అన్నీ మూతపడటంతో ఆదాయం కోల్పోయిన డిస్కంలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాటిని ఆదుకొనేందుకు కేంద్రప్రభుత్వం రూ.90,000 కోట్లు కేటాయించింది. 

నాన్ బ్యాంకింగ్ వ్యవస్థలను ఆదుకొనేందుకు రూ.30,000 కోట్లు కేటాయింపు.  

లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన భవననిర్మాణ రంగానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు కానీ నిర్మాణపనులు పూర్తి చేసుకోవడానికి మరో ఆరు నెలలు గడువు పొడిగించింది.


Related Post