ప్రధాని మోడీ చెప్పిన లోకల్ మంత్ర అర్ధం అదేనా?

May 13, 2020


img

ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ దేశం అన్ని రంగాలలో స్వయంప్రతిపత్తి సాధించవలసిన అవసరం ఉందని, లోకల్ మంత్రం ద్వారా దానిని సాధించవచ్చని చెప్పారు. ఒకప్పుడు భారత్‌లో పీపీఈ దుస్తులు, కోవిడ్ మాస్కూలు తయారయ్యేవికావని కానీ దేశంలో కరోనా ప్రవేశించిన తరువాత నెలకు రెండు లక్షల కిట్స్  ఉత్పత్తి చేయగలుగుతున్నామని చెప్పారు. 

ఒకప్పుడు విదేశాలలో స్థానికంగా తయారైన ఉత్పత్తులను స్థానిక ప్రజలు ఆదరించడం వలననే అవిప్పుడు అంతర్జాతీయస్థాయిలో ‘బ్రాండెడ్ ఐటెమ్స్’గా అమ్ముకోగలిగే స్థాయికి చేరాయని కనుక భారత్‌లో కూడా ఎక్కడికక్కడ స్థానికంగా ఉత్పత్తి, సరఫరా, వినియోగం చైన్లు సృష్టించుకోవలసిన అవసరం ఉందన్నారు. తద్వారా భవిష్యత్‌లో ఇటువంటి సంక్షోభాలు ఎన్ని వచ్చినా భారత్‌ ఇతర దేశాలపై ఆధారపడవలసిన అవసరం ఉండదని అన్నారు. 

ఇప్పటికే ‘మేకిన్ ఇండియా’ పారిశ్రామిక విధానం అమలుచేస్తూ దేశీయంగా ఉత్పత్తులను పెంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, ఇకపై స్థానికంగా ఈ విధానాన్ని అమలుచేసేందుకు కేంద్రప్రభుత్వం భారీ ప్యాకేజీతో తోడ్పడేందుకు సిద్దంగా ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 

కరోనాకు ముందు...దాదాపు అన్ని దేశాలకు ‘చైనా మాల్’ భారీగా ఎగుమతి అవుతుండేది. భారత్‌ విషయానికి వస్తే మొబైల్ ఫోన్లు, వాటిలో టిక్ టాక్ ఆప్ మొదలు కుర్చీలు, లైట్లు, ఫ్యానులు, బొమ్మలు, బట్టలు, బిస్కట్లు, దీపావళి సామానులు, చివరికి వంటింటిలో గిన్నెలు తోముకొనే బ్రషుల వరకు అన్ని చైనా ఉత్పత్తులే. అవి భారతీయుల జీవితంలో భాగం అయిపోయాయంటే అతిశయోక్తి కాదు. కుప్పలు కుప్పలుగా వచ్చిపడుతున్న ‘చైనా మాల్’ దెబ్బకు దేశీయంగా ఎన్నో చిన్నా పెద్ద పరిశ్రమలు దివాళా తీశాయి. వాటిలో పనిచేసేవారు రోడ్డున పడ్డారు. 

అక్కడితో ‘చైనా మాల్’ ఆగిపోలేదు. ప్రపంచదేశాలకు కరోనాను అంటించిన చైనాయే కరోనా సోకకుండా ధరించే మాస్కూలు, గ్లౌజులు వంటి పీపీఈ కిట్లు, కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ వంటివి భారీ స్థాయిలో భారత్‌తో సహా అన్ని దేశాలకు ఎగుమతి చేస్తూ ఈ సంక్షోభ సమయంలో కూడా భారీగా లాభాలు ఆర్జిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ కరోనా నేర్పిన పాఠాలతో కేవలం నెలన్నర వ్యవధిలోనే భారత్‌లో నెలకు రెండు లక్షల పీపీఈ కిట్స్, కోవిడ్ మాస్కూలు తయారుచేయగలుగుతోంది. తద్వారా వాటిని తయారు చేసే స్థానిక సంస్థలు లాభాలు ఆర్జిస్తున్నాయి. అనేకమందికి అవి ఉద్యోగాలు, ఉపాది కల్పిస్తున్నాయి. అంతేకాదు.. చైనాకు తరలిపోవలసిన విలువైన విదేశీమారకం పన్నుల రూపంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలో జమా అవుతోంది. 

కనుక కరోనా నేర్పిన ఈ పాఠాలతో అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కడికక్కడ స్థానికంగా ఉత్పత్తి, సరఫరా, వినియోగం చైన్లు సృష్టించుకొన్నట్లయితే, దేశానికి, స్థానిక పరిశ్రమలకు, స్థానిక ప్రజలకు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు అందరికీ ఎంతో మేలు జరుగుతుందని స్పష్టమవుతోంది. 

కనుక అన్నిటికీ చైనాపై ఆధారపడటం మానుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ చెపుతున్నట్లు భావించవచ్చు. ఇది చాలా మంచి ప్రతిపాదనే కానీ చైనా ఉత్పత్తులను భారత్‌లోకి దిగుమతి కానీయకుండా అడ్డుకోగలిగినప్పుడే మళ్ళీ దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడే దేశీయ, స్థానిక సంస్థలు పుంజుకొని తమ కాళ్లపై తాము నిలబడగలవు. అలాగే చైనా సృష్టించిన ఈ కరోనా విధ్వంసాన్ని కళ్ళారా చూస్తున్న భారతీయులు ‘చైనా మాల్’ పై మోజు తగ్గించుకోవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది.


Related Post