తెలంగాణలో కరోన భేష్! కానీ...

April 24, 2020


img

తెలంగాణ ప్రభుత్వం కరోనాను కట్టడి చేయడంలో సఫలం అవుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రవేశించిన వెంటనే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం మొదటిదశలోనే దానిని చాలా బాగా కట్టడి చేసింది. ఆ అనుభవాలతో అనేక పాఠాలు నేర్చుకొన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో డిల్లీ మర్కజ్‌ కేసులు బయపడగానే రెండవదశలో ఇంకా చురుకుగా నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తూ నెలరోజుల వ్యవధిలో కరోనాపై పూర్తి నియంత్రణ సాధించబోతోంది. కానీ ఇరుగుపొరుగు రాష్ట్రాలలో కరోనా అదుపు తప్పుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేస్తే సరిపోతుందా? అంటే కాదనే అర్ధమవుతోంది. కరోనా అంటే పొరుగింటికి మంటలు అంటుకోవడంగా చెప్పుకోవచ్చు. పొరుగింట్లో మంటలు పూర్తిగా ఆర్పివేసేవరకు మన ఇంటికి కూడా ప్రమాదం ఉన్నట్లే, మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కరోనాను కట్టడి చేసేవరకు తెలంగాణ రాష్ట్రానికి కరోనా భయం తప్పక ఉంటుందని చెప్పకతప్పదు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఎంత చురుకుగా, ఎంత సమర్ధంగా కరోనాను ఎదుర్కొంటున్నప్పటికీ, పొరుగు రాష్ట్రాలు కూడా అంతే చురుకుగా... సమర్ధంగా వ్యవహరించగలిగినప్పుడే తెలంగాణ రాష్ట్రం కరోనా నుంచి విముక్తి లభిస్తుందన్న మాట! 

అదేవిధంగా చైనా..భారత్‌ లేదా మరో దేశం కరోనా మహమ్మారిని పూర్తిగా వదిలించుకొన్నప్పటికీ, ఇతరదేశాల నుంచి మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు ప్రపంచదేశాలలో చైనా ఒక్కటే కరోనాపై పూర్తి నియంత్రణ సాధించినట్లు కనిపిస్తోంది. కానీ మిగిలిన అన్ని దేశాలలో కరోనా వైరస్ వ్యాపించి ఉన్నప్పుడు, ఏదో ఓ రోజు చైనాలో మళ్ళీ కరోనా ప్రవేశించకుండా ఉండదు. అంటే... ఈ ప్రపంచం నుంచి కరోనాను తరిమికొడితే తప్ప ఏ దేశమూ... ఏ రాష్ట్రమూ కరోనరహితం కాజాలదు..కరోన భయం లేకుండా జీవించలేదని చెప్పకతప్పదు. 

తెలంగాణ విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందినప్పుడే తెలంగాణ రాష్ట్రం కూడా కరోనారహిత రాష్ట్రం అవుతుంది. 

అయితే ఒక జిల్లా లేదా ఒక రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసినట్లుగా ఇరుగుపొరుగు రాష్ట్రాలలో, దేశాలలో కరోనాను కట్టడిచేయడం ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాదు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఎప్పుడు? అంటే కరోనాకు వ్యాక్సిన్, నివారణ మందులు కనుగొనేవరకు అని చెప్పుకోవలసి ఉంటుంది. 

కరోనా భయంతో ఎల్లకాలం ఇలాగే లాక్‌డౌన్ చేసుకొని కూర్చోలేము కనుక మే 3న కాకపోతే జూన్ 3నో లేదా మరో రోజున దేశంలో పాక్షికంగానైనా లాక్‌డౌన్‌ ఎత్తివేయక తప్పదు. కానీ అప్పటిలోగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవచ్చు కనుక అవి అందుబాటులోకి వచ్చే వరకు ‘కరోనాతో కలిసి జీవించడం ఎలా’గో ప్రజలందరూ నేర్చుకోక తప్పదు లేకుంటే కరోనా మృతుల జాబితాలో చేరిపోక తప్పదు. ఇది చేదు నిజం. ఈ పరిస్థితులలో తెలంగాణతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ తరువాత కరోనాను పక్కన పెట్టుకొని అన్ని వ్యవస్థలను ఏవిధంగా నడిపించుకోవాలి? అని ఆలోచించవలసిన సమయం దగ్గర పడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పినట్లుగా కరోనా నియంత్రణలో 'లాక్‌డౌన్' అనేది ఒక "పాజ్ బటన్" వంటిదే తప్ప నివారణ కాదు కనుక.   


Related Post