హైకోర్టు కూడా ఆర్టీసీ సమస్యను పరిష్కరించలేదా?

November 12, 2019


img

ఆర్టీసీ సమ్మెపై సోమవారం జరిగిన విచారణ తరువాత హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తుందనుకుంటే, హైకోర్టు కూడా చేతులు ఎత్తేసినట్లు మాట్లాడటంతో గత 38 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారబోతోందా? అనే సందేహం కలుగుతుంది. 

భార్యాభర్తలు గొడవపడి విడిపోవాలనుకొన్నప్పుడు వారిని మొదట రాజీపరిచేందుకు ప్రయత్నించి, అది సాధ్యం కానప్పుడే కోర్టులు చట్ట ప్రకారం విడాకులు మంజూరు చేస్తాయని, అదేవిదంగా ఆర్టీసీ కార్మిక సంఘాలకు, ప్రభుత్వానికి మద్య ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించి సమస్యను పరిష్కరించేందుకు గత నెలరోజులుగా ప్రయత్నించామని కానీ ఇరువర్గాలు రాజీకి సిద్దపడక పోవడంతో ఇక అంశాల ఆధారంగా చట్ట ప్రకారం నిర్ణయం ప్రకటిస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. 

ఆర్టీసీ సమ్మె చట్ట వ్యతిరేకమని ప్రకటించలేమని, ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు చెప్పింది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం ‘ఎస్మా’ ప్రయోగించలేదని, కానీ ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం జీవో జారీ చేస్తే ఎస్మా ప్రయోగించవచ్చని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ సమస్య ప్రభుత్వానికి, కార్మికులకు మద్య నెలకొంది కనుక దీనిని లేబర్ కోర్టులోనే పరిష్కరించుకోవలసి రావచ్చని హైకోర్టు అభిప్రాయపడింది.  

ఆర్టీసీని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరుపబోతోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి హైకోర్టు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనందున, ఆర్టీసీ ప్రయివేటీకరణ విషయంలో కూడా విఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు పనిచేసిన రోజులకు (సెప్టెంబర్) జీతాలను ఇప్పించడానికి హైకోర్టు చేసిన విజ్ఞప్తులనే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఆర్టీసీ ప్రయివేటీకరణపై హైకోర్టు అడ్డుకోలేకపోవచ్చు.

సవరించిన మోటరువాహన చట్టం ప్రకారం ఆర్టీసీని ప్రవేటీకరణ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఏపీఎస్‌ ఆర్టీసీ విభజన ఇంకా ప్రక్రియ పూర్తికాలేదు కనుక టీఎస్‌ఆర్టీసీకి గుర్తింపేలేదని కేంద్రప్రభుత్వం తరపున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు హైకోర్టుకు తెలియజేశారు. టీఎస్‌ఆర్టీసీకి గుర్తింపే లేదు కనుక దానిని ప్రయివేటీకరించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వాదించడం ఖాయం. రాజ్యాంగం, చట్టం ఆధారంగా ప్రభుత్వం చేయబోయే ఈ వాదనలను బహుశః హైకోర్టు కూడా కాదనలేదు. అదే కనుక జరిగితే ఇప్పటి వరకు హైకోర్టుపైనే ఆశపెట్టుకొని సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారవచ్చు.


Related Post