ఆర్టీసీ ర్యాలీని ఆపి ప్రభుత్వం ఏమి సాధించింది?

November 09, 2019


img

ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపు మేరకు శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు ‘ఛలో ట్యాంక్ బండ్’ పేరిట ర్యాలీకి ప్రయత్నించాయి. కానీ జిల్లా స్థాయి నుంచి రాజధాని హైదరాబాద్‌ వరకు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, నగరం నిండా భారీగా పోలీసులను మోహరించడంతో అతి కొద్దిమంది మాత్రమే అన్ని అవరోధాలు దాటుకొని ట్యాంక్ బండ్‌పైకి చేరుకోగలిగారు. వారిని కూడా పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. 

కనుక మొత్తం మీద ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని పోలీసులు విజయవంతంగా అడ్డుకొన్నారని చెప్పవచ్చు. అయితే దీనివలన ప్రభుత్వం ఏమి సాధించింది? అంటే ఏమీ లేదనే అర్ధం అవుతుంది. ఒకేసారి లక్షకు పైగా ప్రజలు ట్యాంక్ బండ్‌ వైపు కదిలివచ్చినట్లయితే, ఆ ఆవేశంలో విధ్వంసానికి పాల్పడితే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుంది కనుక దానిని నివారించగలిగామని పోలీసులు, ప్రభుత్వం చెప్పుకోవచ్చు. కానీ హైకోర్టు చెప్పినట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలతో నిన్ననే చర్చలు ప్రారంభించి ఉండి ఉంటే వారు అసలు ఈ కార్యక్రమమే నిర్వహించేవారు కాదు కదా? ప్రభుత్వం తమతో చర్చలకు రావడంలేదనే ఆక్రోశంతోనే వారు ఇటువంటి కార్యక్రమాలతో తమ నిరసనలు తెలియజేయాలనుకొంటున్నారు తప్ప ఏదో సరదాకో లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యంతో చేయడం లేదు కదా? 

కనుక ఇటువంటి కార్యక్రమాలను చర్చలతో నివారించగలిగే అవకాశమున్నప్పటికీ అటువంటి ప్రయత్నం చేయకుండా, ఆర్టీసీ కార్మికులను అరెస్టులు చేసి, పోలీసుల చేత అడ్డగించి శాంతిభద్రతలను కాపాడటానికి ఆయాసపడటం ఎందుకు? దీని వలన ప్రభుత్వం సాధించింది ఏమిటి? ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్‌పైకి చేరకుండా పోలీసులు అడ్డగించగలిగారు కానీ వారిలో పోరాటస్పూర్తి అలాగే ఉంది కదా? దానిని హైకోర్టు కూడా గుర్తించింది కానీ ప్రభుత్వం మాత్రం గుర్తించడానికి ఇష్టపడటం లేదు. 

ఆర్టీసీ సమ్మెపై విచారణ మొదలైనప్పుడు “ఇది ప్రజాఉద్యమంలాగా మారక ముందే జాగ్రత్తపడండి...ప్రజలు ఉద్యమిస్తే వారిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు” అంటూ ఒకప్పుడు ఫిలిపిన్స్ దేశంలో జరిగిన ప్రజాఉద్యమం గురించి హైకోర్టు ఉదాహరణతో సహా వివరించి చెప్పింది. కానీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం వలన ఆనాడు హైకోర్టు హెచ్చరించినట్లే ఈరోజు ప్రజాఉద్యమం జరిగింది. అయితే దానిని పోలీసులు ఏదోవిధంగా అడ్డుకోగలిగారు కానీ వారిలో ఆ ఉద్యమజ్వాలలు మాత్రం ఇంకా అలాగే రగులుతున్నాయి. అవి కార్చిచ్చులా వ్యాపిస్తే అప్పుడు హైకోర్టు భయపడినట్లే అవుతుంది. 

ఆర్టీసీ సమ్మె వలన జరుగుతున్నా ఆర్ధికనష్టం కంటే దాని కారణంగా జరుగుతున్న ఇటువంటి పరిణామాలన్నీ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు ఎవరికీ మంచిది కాదు. గౌరవప్రదం కావు. ఆర్టీసీ కార్మికులు 36 రోజులుగా పొరాడి చాలా అలసిపోయున్నారు. కనుక వారు కూడా పట్టువిడుపులకు సిద్దంగానే ఉన్నారు. ఒకవేళ వారు బెట్టు వీడకపోతే హైకోర్టు సాయంతోనే వారిని ఒప్పించడం పెద్ద కష్టం కాదు. కనుక ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడమే అందరికీ మంచిది.


Related Post