ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏమిటి?

November 02, 2019


img

ఆర్టీసీ సమ్మె విషయంలో మొదటి నుంచి తెరాస సర్కార్‌ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. 29 రోజుల సమ్మె తరువాత కూడా దానిలో ఎటువంటి మార్పురాలేదు. ఈరోజు జరుగబోతున్న మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీలో అద్దె, ప్రైవేట్ బస్సులపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 

సమ్మెపై హైకోర్టులో జరుగుతున్న విచారణలో ఆర్టీసీ కార్మికుల పట్ల హైకోర్టు చాలా సానుభూతితో ఉన్నట్లే కనిపిస్తోంది కానీ ఇంతవరకు నిర్ధిష్టంగా తీర్పు వెలువరించలేదు. కనీసం ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ జీతాలు చెల్లింపజేయలేపోయింది. అందుకు హైకోర్టును తప్పుపట్టలేము కానీ ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగడంలో ఆలస్యమవుతున్న కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పక తప్పదు.  

ఆర్టీసీ సమ్మె విషయంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జోక్యం చేసుకొనే ఆలోచన ఉన్నట్లు కనబడటం లేదు. ఆర్టీసీ సమ్మెపై ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం కలుగజేసుకోలేదు. సమ్మె వివరాలతో డిల్లీకి రావలసిందిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు పిలుపు వచ్చింది కనుక ఇప్పుడైనా కలుగజేసుకొంటుందో లేదో త్వరలో తెలుస్తుంది. 

ఆర్టీసీ సమ్మెకు రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇస్తున్నాయి కానీ వాటి ఒత్తిళ్ళకు ప్రభుత్వం తలవంచడం లేదు. కనుక ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. మరో మూడు రోజులలో సమ్మె 2వ నెలలోకి ప్రవేశించినట్లవుతుంది. ఒకనెల జీతం అందకపోతేనే ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఒకవేళ సమ్మె ఇంకా కొనసాగితే వారి పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది.

ఒకవేళ ప్రభుత్వం ఆర్టీసీలో కొత్తగా అద్దె, ప్రైవేట్ బస్సులను ప్రవేశపెడితే హైకోర్టు వాటిని అడ్డుకోలేదు. వాటితో ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ మరింత ప్రశ్నార్ధకం అవుతుంది. 

రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం, హైకోర్టు, గవర్నర్‌ ఎవరూ ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏమిటి?అనే సందేహం కలుగకమానదు. సమ్మె ఇంకా ఎప్పటికీ ముగుస్తుందో తెలియదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిఎం కేసీఆర్‌ అంగీకరిస్తారా లేదా? అని ఇప్పుడు ఎవరూ ఆలోచించడం లేదు. మళ్ళీ తమను ఉద్యోగాలలోకి తీసుకోంటారో లేదోనని ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళనతోనే గుండెపోటు తెచ్చుకొంటున్నారు. ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఆర్టీసీలో పనిచేస్తునా వారిలో చాలా మంది 40-50 ఏళ్ళ వయసులో వారే. ఆ వయసులో ప్రతీ వ్యక్తికి చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. ఇటువంటి కీలక సమయంలో భవిష్యత్ అంధకారంగా అగమ్యగోచరంగా మారితే భరించడం చాలా కష్టం.    

ఆ ఆలోచననే భరించలేక తీవ్ర ఆందోళన, నిరాశ నిస్పృహలకు లోనవుతున్న అనేకమంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. ఇంకా చనిపోతూనే ఉన్నారు. వారి భయాలను దూరం చేసి మళ్ళీ వారు ప్రశాంతంగా పనిచేసుకొంటూ జీవించేలా చేయాల్సిన బాధ్యత,శక్తి ఒక్క ప్రభుత్వానికే ఉంది. కనుక 50,000 మంది ఆర్టీసీ కార్మికులు...వారిపై ఆధారపడిన వారి కుటుంబాలను కాపాడుకొనేందుకు పాలకులు, ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు అందరూ ఒక మెట్టు దిగి రాజీపడి తక్షణం సమ్మెను ముగించడం చాలా అవసరం లేకుంటే తరువాత జరుగబోయే అవాంఛనీయ పరిణామాలకు అందరూ బాధపడవలసి వస్తుంది.  



Related Post