సమ్మె ముగిసినా ఆర్టీసీ కార్మికులు నష్టపోక తప్పదా?

October 30, 2019


img

ఆర్టీసీ సమ్మె 25రోజుకు చేరుకొన్నప్పటికీ ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఒకపక్క ప్రభుత్వం ఆర్టీసీని పాక్షికంగా ప్రవేటీకరించడానికి కసరత్తు చేస్తుంటే, మరోపక్క ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉదృతం చేస్తున్నారు. కనుక నానాటికీ పరిస్థితులు ఇంకా జటిలమవుతూనే ఉన్నాయి తప్ప కనుచూపుమేరలో పరిష్కారం కనిపించడం లేదు. ఈ పరిస్థితులు ఇలాగే ఇంకా కొనసాగితే ఏమవుతుంది? అని ఆలోచిస్తే, ఆర్టీసీలో 30 శాతం అద్దెబస్సులు, 20 శాతం ప్రైవేట్ బస్సులు ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే ఆర్టీసీకి 50 శాతం మాత్రమే మిగిలి ఉందన్నమాట!  

ప్రస్తుతం 83 శాతం సొంతబస్సుల నిర్వహణకు సుమారు 50,000 మంది ఆర్టీసీ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ సొంతబస్సులు ఒకేసారి 50 శాతానికి తగ్గిపోతే ఆమేరకు ఆర్టీసీ కార్మికులను కూడా తగ్గించుకోవడం అనివార్యం అవుతుంది. 

అద్దె, ప్రైవేట్ బస్సులను లాభదాయకత లేని మారుమూల జిల్లాలకు, గ్రామాలకు నడిపేందుకు ప్రైవేట్ సంస్థలు ఇష్టపడవు. కనుక ఆ మార్గాలలో ఆర్టీసీ సొంత బస్సులనే నడిపించవలసి ఉంటుంది. రాష్ట్రంలో ప్రధాన మార్గాలన్నిటిలో నడిపిస్తున్నప్పుడే ఆర్టీసీకి భారీగా నష్టాలు వస్తున్నప్పుడు లాభదాయకత లేని మార్గాలలో సొంత బస్సులను నడిపిస్తే ఇంకా నష్టాలు రావడం తధ్యం. అలాగే ఆర్టీసీ కార్మికులు పనిచేసిన రోజులకు జీతాలు ఇవ్వలేమని చెపుతున్న ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అప్పుడు ఏవిధంగా ఇస్తాయి? జీతాలే ఇవ్వలేనప్పుడు లక్ష రూపాయలు బోనస్ ఏవిధంగా ఇవ్వగలదు? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఒకవేళ ఆర్టీసీ సమ్మె కొనసాగితే ఆర్టీసీలో అద్దె, ప్రైవేట్ బస్సులు ప్రవేశించడం ఖాయం. సమ్మె ముగిసినా ప్రవేశించడం ఖాయం. కనుక ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వంతో రాజీపడి సమ్మె ముగించినా, అద్దె, ప్రైవేట్ బస్సుల రూపంలో వారికి మరో గండం పొంచి ఉంటుంది. కనుక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పట్టుపట్టే బదులు తమ ఉద్యోగాలను, భవిష్యత్‌ను ప్రశ్నార్ధకంగా మార్చబోతున్న ఆర్టీసీ ప్రయివేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరితే మంచిదేమో?


Related Post