సమ్మె చట్టవిరుద్దమైతే చర్యలు ఎందుకు తీసుకోలేదు? హైకోర్టు ప్రశ్న

October 28, 2019


img

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ తీరుపట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును సోమవారం మధ్యాహ్నం మళ్ళీ విచారణ చేపట్టినప్పుడు, ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఇరుపక్షాలకు కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. కొన్ని మంచి సూచనలు కూడా చేసింది. 

ఆర్టీసీని రాత్రికి రాత్రి ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదు కనుక ఆ డిమాండును పక్కన పెట్టి మిగిలినవాటిపై చర్చించుకొని పరిష్కరించుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు సూచించింది. సమ్మె ఇంకా కొనసాగితే ప్రజలే కాకుండా ఆర్టీసీ కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోతారని గుర్తుంచుకొని పట్టువిడుపులతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. 

ఈ సందర్భంగా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యానికి అనేక ప్రశ్నలు, చురకలు వేసింది.   

1. ఈడీల కమిటీ సమర్పించిన నివేదికను హైకోర్టుకు ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందని ప్రశ్నించింది. 

2. ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టరును నియమించాలని తమ ఆదేశాలపై ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకొందని నిలదీసింది. 

3. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్దమని ప్రభుత్వం భావిస్తుంటే మరి సమ్మె చేస్తున్న కార్మికులపై ఏమి చర్యలు తీసుకొందని ప్రశ్నించింది.

4. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ముందే అన్ని నిర్ణయించుకొని చర్చలకు వెళ్ళడం ఏమిటని నిలదీసింది. 

5. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ రూ.1,400 కోట్లు బాకీ ఉన్నమాట వాస్తవమా కాదా ఉంటే ఇంతవరకు దానిని ఎందుకు చెల్లించలేదు?అని నిలదీసింది. 

6. అలాగే ఆర్టీసీకి చెల్లించవలసిన రూ.3,567 కోట్లు బకాయిలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించింది. 

ఈ ప్రశ్నలకు ప్రభుత్వం తరపున వాదించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ సమాధానాల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం, తక్షణమే అడ్వకేట్ జనరల్‌ (ఏజీ) హాజరయ్యి వాదనలు వినిపించాలని ఆదేశించడంతో ఏజీ, బీఎస్ ప్రసాద్ వచ్చి ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగించారు. కానీ ఆర్టీసీ కార్మికుల 4 డిమాండ్లను నెరవేర్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం రూ.46.2 కోట్లు ఇచ్చే పరిస్థితిలో లేదని ఆయన వాదించడంతో హైకోర్టు ధర్మాసనం మళ్ళీ అసహనం వ్యక్తం చేసింది. 

రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుంచి వైద్యం కోసం పట్టణాలకు వెళ్ళేవారు ఆర్టీసీ బస్సులలోనే వెళుతుంటారని, కానీ సమ్మె కారణంగా అవి తిరగనప్పుడు వారు ప్రాణాలు కోల్పోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఉన్నట్లయితే, ఆర్టీసీ కార్మికుల 4 డిమాండ్లను నెరవేర్చడానికి రూ.46.2 కోట్లు ప్రభుత్వం ఇవ్వలేదా?అని నిలదీసింది. ప్రభుత్వాన్ని అడిగి సమాధానం చెపుతానని ఏజీ చెప్పగా, అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఆర్ధికశాఖ కార్యదర్శిని కూడా కోర్టుకు పిలవవలసి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. 

హైకోర్టు సందించిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు బుదవారం వరకు సమయం ఇవ్వాలని ఏజీ కోరగా హైకోర్టు నిరాకరించింది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్ళీ ఈకేసు విచారణ చేపడతామని, అప్పుడు సంతృప్తికరమైన సమాధానాలతో కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలతో సమస్యను పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. 


Related Post