చర్చలు అందుకే...నా?

October 26, 2019


img

ప్రభుత్వం నియమించిన టి.వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు-ఆర్టీసీ జేఏసీ నేతల మద్య శనివారం మధ్యాహ్నం ఎర్రమంజిల్‌లోని ఈఎన్‌సీ భవనంలో జరిగిన మొదటి విడత చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. 

కానీ ప్రభుత్వం నుంచి మళ్ళీ పిలుపువస్తే చర్చలకు హాజరవుతామని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి చెప్పారు. బ్రిటిష్ వారి హయాంలో కూడా ఇటువంటి నిర్బంద చర్చలు జరుగలేదని అన్నారు. కమిటీ సభ్యులు ముందుగా నిర్ణయించుకొన్న అంశాలపై మాత్రమే చర్చించాలని పట్టుబట్టారని, తమకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. కోర్టులో తమను ఇరుకున పెట్టేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టుకొంది తప్ప తమ సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్లు కనబడలేదని అన్నారు. కనుక ఆర్టీసీ సమ్మె యధాప్రకారం కొనసాగుతుందని అశ్వధామరెడ్డి చెప్పారు.     

కోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు ప్రారంభించినప్పటికీ జేఏసీ నేతలు అర్ధాంతరంగా సమావేశంలో నుంచి వెళ్ళిపోయారని అయినప్పటికీ వారి కోసం సాయంత్రం 6.30 గంటల వరకు ఎదురుచూశామని, ఇక వారు రారని భావించి తాము కూడా వెళ్లిపోతున్నామని ఆర్టీసీ ఇన్-ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ అన్నారు. మళ్ళీ చర్చలు జరుగుతాయో చెప్పలేమని అన్నారు.

కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్చలు జరిపి ‘మమ’ అనిపించేసింది కనుక మళ్ళీ చర్చలు ఉండకపోవచ్చు. కనుక ఇక మిగిలింది న్యాయపోరాటం. రాజకీయ పోరాటాలే. 

ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా చూసినట్లయితే ప్రభుత్వం హైకోర్టులో తన వాదనలను సమర్ధించుకొనేందుకు  అవసరమైన అస్త్రశస్త్రాలన్నీ ఒక పద్దతి ప్రకారం సమకూర్చుకొన్నట్లు కనిపిస్తోంది

1. కోర్టు ఆదేశాలను మన్నించి చర్చలు జరిపింది. 2.కోర్టు చెప్పిన అన్ని అంశాలపై చర్చలకు సిద్దపడింది. 3. సమ్మె ముగించేందుకు ప్రయత్నించింది. 4. సమ్మె విరమించి వస్తే ఆర్టీసీ కార్మికులందరినీ ఉద్యోగాలలోకి తీసుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 5. కానీ ఆర్టీసీ జేఏసీ నేతలు మొండిగా ప్రవర్తించి చర్చలకు నిరాకరించి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. వారికోసం కమిటీ సభ్యులు సమావేశమందిరంలో చాలాసేపు ఎదురుచూశారు కానీ వారు మళ్ళీ చర్చలకు రాలేదు. 6. మోటారువాహనాల చట్టం 2019 ప్రకారం ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి. 

కనుక హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని గట్టిగా సమర్ధించుకోగలదు. అంతేకాదు..ఆర్టీసీ జేఏసీ నేతలు దురుదేశ్యంతోనే ఈ సమ్మెను ప్రారంభించారని వాదిస్తున్న ప్రభుత్వం, కోర్టు ఆదేశాల మేరకు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొని సమ్మెను ముగింపజేయాలని తాము ప్రయత్నించినప్పటికీ ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకే మొగ్గుచూపుతున్న కారణంగా వారు చర్చలు కొనసాగించకుండా అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారని వాదిస్తూ అటు హైకోర్టులోను, ఆర్టీసీ కార్మికుల ముందు ఆర్టీసీ జేఏసీ నేతలను దోషులుగా నిలబెట్టడానికి గట్టిగా  ప్రయత్నింవచ్చు. అప్పుడు ఆర్టీసీ కార్మికులలో అయోమయం, ఆందోళన మొదలయితే వారంతట వారే ఆర్టీసీ యాజమాన్యం ముందు బేషరతుగా మోకరిల్లుతారని ప్రభుత్వం ఆలోచన కావచ్చు.

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వవైఖరిని సిఎం కేసీఆర్‌ ముందే చాలా నిష్కర్షగా చెప్పారు కనుక అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నట్లు అర్ధమవుతోంది. కోర్టులో ప్రభుత్వ వాదనలను బలపరుచుకొనేందుకే ఈ కమిటీ..నివేదిక...చర్చలు తతంగమంతా నడిపించినట్లు అర్ధమవుతూనే ఉంది. ఇది నిజమని 28వ తేదీన హైకోర్టులో విచారణ జరిగినప్పుడు స్పష్టం అవుతుంది. అప్పుడు కోర్టు కూడా ఆర్టీసీ కార్మికులనే తప్పు పట్టినా ఆశ్చర్యం లేదు కనుక ఆర్టీసీ కార్మికులు అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్ళను తట్టుకొంటూ సమ్మెను ఇంకా కొనసాగించగలరా లేదా? తేల్చుకోవడం మంచిది. 


Related Post