మెట్రో లాభాల్లో... ఆర్టీసీ నష్టాల్లో.. ఎందుకు?

October 25, 2019


img

21 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె..దానిపై ఆర్టీసీ కార్మికుల, సిఎం కేసీఆర్‌ భిన్న వాదనలు ఒక కొత్త చర్చకు అవకాశం కల్పించాయి. 

నవంబర్ 2017లో హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ సేవలు మొదలయ్యాయి. అంటే నేటికీ ఇంకా రెండేళ్ళు కూడా పూర్తికాలేదన్న మాట. కానీ నాటి నుంచి మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఆ కారణంగా హైదరాబాద్‌ మెట్రో  రెండేళ్లలోనే లాభాలు ఆర్జిస్తోంది. కానీ దశబ్ధాల క్రితం సమైక్యరాష్ట్రంలో ఏర్పాటైన ఆర్టీసీ సంస్థ నేడు కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకొందని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు. 

నిజానికి ఆర్టీసీతో పోలిస్తే మెట్రో నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారం. ఆర్టీసీతో పోలిస్తే మెట్రో టికెట్ ధరలు కూడా చాలా ఎక్కువే. పైగా ఆర్టీసీ బస్సులలాగ మెట్రో రైళ్లు నగరం, రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళలేవు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలలో నిర్ధిష్ట మార్గాలకే పరిమితం. రెండేళ్ళ క్రితం ప్రారంభం అయ్యి పరిమిత మార్గాలలో పరిమిత సర్వీసులు మాత్రమే నడుపుతున్న మెట్రో లాభాలబాటలో దూసుకుపోతుంటే, రాష్ట్రంలో ప్రతీ జిల్లాకు, జిల్లాలో  మారుమూల ప్రాంతాలకు...ఇరుగుపొరుగు రాష్ట్రాలకు కూడా ప్రయాణికులను చేరవేస్తున్న టీఎస్‌ఆర్టీసీ ఎందుకు నష్టాలలో మునిగిపోతోంది? కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి ఎందుకు చేరుకొంది? దీనికి ఎవరు కారకులు? లోపం ఎక్కడుంది? దానిని ఏవిధంగా సరిదిద్దవచ్చు? అని ఆలోచించాలి.   

రెండేళ్లలోనే మెట్రోకు లాభాలు రావడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1. రాజకీయాలకు మెట్రో దూరంగా  ఉండటం లేదా మెట్రోలో రాజకీయాలు లేకపోవడం. 2. సమర్ధమైన నిర్వహణ. 

కానీ ఆర్టీసీ మొదటి నుంచి రాజకీయాలతోనే ముడిపడి సాగుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిఎం కేసీఆర్‌ ఇష్టపడకపోయినా తెరాసలో రాజకీయనిరుద్యోగులకు ఆర్టీసీ ఛైర్మన్ పదవినిస్తుంటారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు లేదా వారి దగ్గర బందువులు, అలాగే ఆర్టీసీలో కొందరు ఉన్నతాధికారులు అద్దెబస్సులను నడిపించుకొంటున్నారని, ఆర్టీసీకి డీజిల్ సరఫరా చేసే బంకులు, బస్సుల మరమత్తులకు అవసరమయ్యే సామాగ్రిని కూడా వారే సరఫరా చేస్తూ లాభాలు గడిస్తున్నారని, వారే ఆర్టీసీని చెదపురుగుల్లా తొలిచేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేతలు వాదిస్తున్నారు.

మెట్రోలో ఈవిధంగా సొంతంగా ఎవరికి వారు ప్రైవేట్ రైళ్లు నడిపించే అవకాశం లేదు. మెట్రోకు స్పేర్ పార్టులు, కరెంటు అమ్ముకొనే అవకాశం కూడా లేదు కనుకనే దానివైపు రాజకీయనేతలు ఎవరూ కన్నెత్తి చూడటంలేదనుకోవాలేమో? అందుకే మంత్రి పదవి ఆశించి భంగపడిన ఓ తెరాస సీనియర్ నేతకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇవ్వజూపితే “దానిలో రసం లేదు. ఒట్టి పిప్పి మాత్రమే ఉందిపుడు. అదెందుకు నాకు?” అని ప్రశ్నించారు. అంటే రసం ఉంటే పిండుకొని త్రాగాలనుకొంటున్నట్లే కదా? 

ఇక మెట్రో కంటే చాలా విస్తారమైన సేవలు అందిస్తున్న ఆర్టీసీని సమర్ధంగా నిర్వహించగలిగితే తప్పకుండా లాభాలు వస్తాయని ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ వంటివారు వాదిస్తున్నారు. ఆర్టీసీని తనకు అప్పగిస్తే రెండేళ్లలో లాభాల బాట పట్టిస్తానని ప్రభుత్వానికి సవాలు కూడా విసిరారు. అంటే ఆర్టీసీ యాజమాన్యానికి చిత్తశుద్ది ఉంటే నేటికీ ఆర్టీసీని లాభాలబాటలో నడిపించవచ్చునని అర్ధమవుతోంది. కానీ ముందుగా ఆర్టీసీలో యూనియన్లను ఎలా తొలగించాలని కాక రాజకీయజోక్యం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది.  

ఈవిధంగా ఆర్టీసీలో సమస్యలను, లోపాలను గుర్తించి పరిష్కరించే బదులు, ఆర్టీసీ దివాళా తీసింది...కార్మికుల గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. కనుక ఆర్టీసీని మూసివేయడమే మంచిదని పాలకులు వాదిస్తుండటం విస్మయం కలిగిస్తుంది.


Related Post