నిర్మలా సీతారామన్ చెప్పిందే నిజమవుతోందా?

October 23, 2019


img

ఆర్ధికమాంద్యం కారణంగా దేశంలో వాహనాల తయారీరంగం నష్టపోతోందనే వాదనలు వినిపించినప్పుడు దేశ ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, “దేశంలో ఓలా, ఊబెర్ వంటి క్యాబ్ సర్వీసులు పెరిగిపోయినందునే ప్రజలు వాహనాల కొనుగోలు తగ్గించుకొంటున్నారు,” అని అన్నారు. 

ఆమె మాటలు నిజమని అందరికీ తెలుసు. ఇప్పుడు కార్లు కొని వాటిని మెయింటెయిన్ చేయడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. కనుక అంత స్థోమతు లేనివారు ఓలా, ఊబెర్ సేవలను విరివిగా ఉపయోగించుకొంటున్నారు. వాటి సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి రావడంతో సామాన్యప్రజలు సైతం ఇప్పుడు ఓలా, ఊబెర్ కార్లలో హాయిగా ప్రయాణిస్తున్నారు. కనుక దేశప్రజల ఆలోచనా దృక్పదంలో వస్తున్న ఈ మార్పు దేశీయవాహన తయారీ రంగంపై ప్రభావం చూపుతోందనే నిర్మలా సీతారామన్ వాదన సరైనదేనని స్పష్టమవుతోంది.  

ఊబెర్ కంపెనీ సీఈఓ ఖోస్రో షాహీ కూడా ఆమె మాటలను దృవీకరిస్తున్నట్లు మాట్లాడటం విశేషం. డిల్లీ మెట్రో మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు అనుబందంగా ఊబెర్ బస్సులను నడిపేందుకు ఒప్పందం చేసుకోవడానికి డిల్లీ వచ్చినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సొంతకార్లు కలిగి ఉండాలనే ఆలోచన నుంచి భారతీయులు అందరూ బయటపడాలి. అప్పుడే తక్కువ ధరలో మరింత సుఖవంతమైన ప్రయాణం చేయడానికి కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి.  ముఖ్యంగా దేశీయంగా బలంగా పాతుకుపోయిన వాహనఉత్పత్తి సంస్థలే ప్రజలకు మేలు చేసే ఇటువంటి ఆవిష్కరణలకు ప్రధాన శత్రువులుగా ఉన్నాయి. కనుక దేశప్రజలందరూ వాటికి దూరంగా ఉండాలి. సొంత కార్లు కలిగి ఉండాలనే ఆలోచన వలన మౌలిక వసతుల కల్పనపై పెట్టుబడి పెట్టవలసిన తరుణంలో 10-20 సం.ల పాత సొంత వాహనాలపై ఖర్చు పెట్టవలసి వస్తుంది. కనుక సొంత వాహనాలు కలిగి ఉండటమనే ఆలోచన గొప్పదనుకోలేము. సొంత వాహనాలను కలిగి ఉండాలనే భారతీయుల ఆలోచనా దృక్పదం మారితే భారత్‌ కూడా శరవేగంగా అభివృద్ధి సాధిస్తుంది,” అని అన్నారు. 

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఓలా, ఊబెర్ వంటి అద్దె కార్ల మార్కెట్ పెరిగిపోయినందునే ప్రజలు కార్లు కొనడం తగ్గించారని చెపితే, ఇదే సరైన పద్దతని ఊబెర్ కంపెనీ సీఈఓ ఖోస్రో షాహీ అంటున్నారు. పైగా భారత్‌లో పాతుకుపోయిన మారుతీ, టాటా వంటి కార్ల తయారీపరిశ్రమలకు దూరంగా ఉండాలని బహిరంగంగానే హెచ్చరించారు. 

దేశంలో క్యాబ్ సర్వీసులు ఖచ్చితంగా కొత్త ఆవిష్కరణే వాటి వలన సామాన్య ప్రజలు సైతం లబ్ది పొందుతున్నారనేది వాస్తవం. కానీ వాటి కోసం దేశీయ పరిశ్రమలను బలిచేసుకొంటే నష్టపోయేది భారతదేశమే. వాహనతయారీ పరిశ్రమలు, వాటి అనుబంద పరిశ్రమలలో లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాది కల్పిస్తున్నాయి. అవి చెల్లిస్తున్న లక్షల కోట్ల పన్నులు దేశ ఆర్ధికవ్యవస్థను నిలబెడుతున్నాయి. ప్రజలు నేటికీ సొంత కార్లు, బైకులు కొంటున్నందునే వాటి తయారీ సంస్థల మొదలు రోడ్డు పక్కన మెకానిక్కుల వరకు మనుగడ సాగించగలుగుతున్నారు. 

కానీ దేశప్రజల ఆలోచనా దృక్పదంలో వస్తున్న ఈ మార్పును ప్రభుత్వమూ, వాహనతయారీ సంస్థలు ముందే పసిగట్టి అందుకు తగ్గట్లు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగవలసి ఉంటుంది. అప్పుడే మనుగడ సాగించగలవు. బహుశః అందుకే అప్పుడే కొన్ని కార్ల కంపెనీలు తమ కొత్త కార్లను అమ్ముకునే బదులు అద్దెకు ఇచ్చేందుకు తగిన వ్యూహాలు సిద్దం చేసుకొంటున్నాయి. 


Related Post