ఆర్టీసీ సమస్యకు మరో కమిటీ...దేనికి?

October 23, 2019


img

ఆర్టీసీ సమ్మె మొదలవక మునుపు కార్మిక సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో కూడిన త్రిసభ్య ఏర్పాటు చేసింది. వారితో వరుసగా మూడురోజుల పాటు సమావేశమైన ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్ల గురించి చర్చించారు. కానీ అప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ నేతలు పట్టుబట్టడంతో చర్చలు విఫలమయ్యాయి. సమ్మె మొదలైంది. 

హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై అధ్యయనం చేసి నివేదిక అందజేసేందుకు తెరాస సర్కార్‌ మళ్ళీ నిన్న ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. వారి సిఫార్సులు, ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 

అయితే మొదటవేసిన త్రిసభ్య కమిటీ ద్వారా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు మళ్ళీ వాటిపై అధ్యయనం కోసం మరో కమిటీ ఎందుకు? అది కేవలం కంటితుడుపు చర్య.. కమిటీల పేరుతో కాలయాపన చేయడానికేనని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి అన్నారు. అయినప్పటికీ కమిటీ చర్చలకు పిలిస్తే వెళ్ళేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.   

మొదట వేసిన కమిటీకి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై నిర్ణయం తీసుకొనే అధికారాలు లేవు. సిఎం కేసీఆర్‌ కార్మికుల డిమాండ్లకు అంగీకరించనందున చర్చలు విఫలమయ్యాయని అందరికీ తెలుసు. అయితే ఈసారి ఆర్టీసీ కార్మికులు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ వదులుకొన్నారు కనుక మిగిలిన డిమాండ్లపై చర్చించడానికి సిఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారని అర్దమవుతోంది. 

ఆర్టీసీ కార్మికులు డిమాండ్లలో అద్దె బస్సులు తగ్గించి సొంత బస్సుల సంఖ్యను పెంచాలనేది కూడా ఒకటి. కానీ ప్రభుత్వం ఆర్టీసీలో 30 శాతం అద్దె బస్సులను, 20 శాతం ప్రైవేట్ సర్వీసులను ప్రవేశపెట్టాలని నిశ్చయించుకొంది. వాటికోసం అప్పుడే సన్నాహాలు కూడా చేస్తోంది. కనుక ఈసారి చర్చలలో ఇదే అంశంపై మళ్ళీ ఇరువర్గాల మద్య ప్రతిష్టంభన ఏర్పడవచ్చు. 

అప్పుడు తెరాస సర్కార్‌ కమిటీ నివేదికను, వారి సిఫార్సులను హైకోర్టుకు అందజేసి ఆర్టీసీ కార్మికుల మొండిపట్టుదల కారణంగానే చర్చలు విఫలం అవుతున్నాయని గట్టిగా వాదించవచ్చు. మోటారు వాహనాల చట్టానికి మోడీ ప్రభుత్వం చేసిన తాజా సవరణలతో ఆర్టీసీలో అద్దె, ప్రైవేట్ సర్వీసులను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నాయి కనుక దానిని అమలుచేయకుండా హైకోర్టు కూడా అడ్డుకోలేదు. కనుక ఆర్టీసీ ప్రయివేటీకరణకు కార్మిక సంఘాలు అంగీకరిస్తేనే వారి మిగిలిన డిమాండ్లలో సంస్థకు, కార్మికులకు చెల్లించవలసిన బకాయిలు, వైద్య సౌకర్యాలపై చర్చలు జరిగే అవకాశం ఉంటుంది లేకుంటే ఆర్టీసీ సమ్మెకు ముగింపు లభించడం కష్టమే. కనుక ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు మద్య ఏర్పడబోయే ఈ ప్రతిష్టంభనను ఎవరు ఎప్పుడు ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి.


Related Post