తెలంగాణలోనే ఇలా...ఎందుకు?

October 22, 2019


img

తెరాస మొదటిసారి అధికారం చేపట్టినప్పుడు రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనున్నాయి. అదే సమయంలో తెరాస సర్కారుకు రాజకీయంగా కొన్ని సవాళ్ళు ఎదురయ్యాయి. అలాగే తెరాసపై ప్రజలు అనేక ఆశలు పెట్టుకొన్నారు. వాటిని నిలబెట్టుకోవలసిన ఒత్తిడి కూడా ఉంది. అటువంటి పరిస్థితులలో సిఎం కేసీఆర్‌ చాలాచక్యంగా ఒక్కో సమస్యను పరిష్కరించుకొంటూ అనేక సంస్కరణలు అమలుచేసి కేవలం 4 ఏళ్ళ వ్యవధిలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపించగలిగారు. అదేసమయంలో అనేకానేక సంక్షేమపధకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల మనసులను దోచుకొన్నారు. ఆ కారణంగా ఆయన ప్రతిపక్షాల పట్ల కటినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగిన ప్రతీ ఎన్నికలలో తెరాస తిరుగులేని విజయాలు సాధిస్తూ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. 

ఇదంతా నాణేనికి ఒకవైపు అనుకుంటే రెండోవైపు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

గత ఆరేళ్లలో తెరాస సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకొన్నా అది వివాదాస్పదం అవుతూనే ఉంది. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, వాటి భూసేకరణ, ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేస్తున్న అప్పులు, నిర్వహణ వ్యయం మొదలైన ప్రతీ అంశంపై విమర్శలు వెల్లువెత్తాయి. న్యాయస్థానాలలో వందల కొద్దీ పిటిషన్లు దాఖలయ్యాయి.  

మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, రాయితీ గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ పధకాలపై సైతం తెరాస సర్కార్‌ విమర్శలు ఎదుర్కొక తప్పలేదు. అభివృద్ధి, సంక్షేమ పధకాలకు మాత్రమే కాదు, విధానపరమైన నిర్ణయాలపై కూడా తెరాస సర్కార్‌ న్యాయపోరాటాలు చేయక తప్పడం లేదు. మున్సిపల్ ఎన్నికలు మొదలు హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల వరకు కోర్టులలో పిటిషన్లు దాఖలావుతూనే ఉన్నాయి. ఉస్మానియా ఆసుపత్రి, సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతలను, తరలింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో జరుగుతున్న పోరాటాలను అందరూ చూస్తూనే ఉన్నారు.               

చివరికి ఇంటర్ ఫలితాలు, ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ల మొదలు నియామక ప్రక్రియ వరకు ప్రతీ దశలోను వివాదాలు న్యాయస్థానాలలో పిటిషన్లు ఎదుర్కోక తప్పడంలేదు. ఆ కారణంగా టిఆర్టీలో అర్హత సాధించి రెండేళ్ళవుతున్నా నియామకపత్రాలు ఇవ్వడం లేదని ఎంపికైన అభ్యర్ధులు తరచూ ప్రగతి భవన్‌ ముందు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. 

ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వం తీసుకొనే ప్రతీ నిర్ణయంపై న్యాయస్థానాలలో పిటిషన్లు ఎందుకు దాఖలవుతున్నాయి?తన నిర్ణయాల అమలు కోసం తెరాస సర్కార్‌ ఎందుకు న్యాయపోరాటాలు చేయవలసివస్తోంది?అనే సందేహాలు కలుగుతాయి. దానికి అధికార తెరాస, ప్రతిపక్షాలు భిన్నమైన సమాధానాలు చెపుతుంటాయి. 

రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతూ, సంక్షేమ పధకాలతో ప్రజలు సంతృప్తి చెందినట్లయితే రాష్ట్రంలో ప్రతిపక్షాలు మనుగడ కష్టం కనుక వారే ప్రభుత్వానికి అడుగడుగునా ఈవిధంగా అవరోధాలు కల్పిస్తున్నారని తెరాస ఆరోపిస్తుంటుంది. 

అభివృద్ధి పేరుతో తెరాస సర్కార్ భారీగా అవినీతికి, అక్రమాలకు పాల్పడుతోందని, హామీలు నిలబెట్టుకొనే ఉద్దేశ్యం లేనందునే న్యాయవివాదాలకు ఆస్కారం కలిగేవిధంగా నోటిఫికేషన్లు జారీచేస్తోందని, ఆ తరువాత ఏమీ చేయకుండానే ప్రతిపక్షాలను నిందిస్తూ న్యాయవివాదాలతో కాలక్షేపం చేసేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

ప్రతిపక్షాలను, మంత్రులను పరిగణనలోకి తీసుకోకుండా సిఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వలననే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావులు వాదిస్తున్నారు. కారణాలు ఏవైనప్పటికీ ప్రతీ అంశంపైనా ఏదో ఓ వివాదం ఉంటోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? అని తెరాస సర్కార్‌ ఆలోచించవలసి ఉంది.


Related Post