జి.ఎస్.టి.బిల్లుకి రాజ్యసభ నిన్న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సభలో ఉన్న 203 మంది అధికార, ప్రతిపక్ష సభ్యులు అందరూ దానికి అనుకూలంగా ఓట్లు వేయడంతో మోక్షం లభించింది. ఈ బిల్లుకి పార్లమెంటు ఆమోద ముద్ర పడింది కనుక ఇక మిగిలిన ప్రక్రియ అంత లాంఛనప్రాయమే. కనుక ఈ సరికొత్త ఏకీకృత పన్ను విధానం 2017 ఏప్రిల్ 1 నుంచి దేశంలో అమలులోకి వస్తుంది.
దేశంలో దశాబ్దాలుగా అమలులో ఉన్న పన్నువిధానం స్థానంలో ఈ కొత్త విధానం అమలులోకి వస్తుంది కనుక, దేశ ఆర్ధిక వ్యవస్థలో, ఉత్పత్తి, మార్కెట్ రంగాలలో గణనీయమైన మార్పు, అభివృద్ధి కనబడే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలలో ఉత్పత్తులు, సేవలపై స్థానిక ప్రభుత్వాలు పన్నులు విధించుకొనేవి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్ను విధిస్తుండేది. అవన్నీ కలిపి సుమారు 30శాతం వరకు ఉండేవి. ఈ కొత్త విధానం వలన అవిప్పుడు 18-20 శాతానికి తగ్గే అవకాశం ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానం అమలు చేయడం వల్లే ఇది సాధ్యం అవుతుందని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్న జి.ఎస్.టి. కౌన్సిల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలకి ప్రాతినిధ్యం కల్పించబోతోంది కనుక అది సాధ్యమేనని భావించవచ్చు.
ఈ విధానం అమలులొకి వస్తే ఇకపై రాష్ట్రాలకి స్థానిక పన్నులు విధించుకొనే అవకాశం ఉండదు. కనుక ఆ మేరకు రెవెన్యూని కోల్పోతాయి. దానిని కేంద్ర ప్రభుత్వమే మొదటి మూడు సంవత్సరాలలో 100 శాతం తరువాత సంవత్సరంలో 75శాతం, చివరి సంవత్సరంలో 50 శాతం భర్తీ చేస్తానని ఈ బిల్లులోనే హామీ ఇచ్చింది. కనుక దాని గురించి ఆందోళన చెందనవసరం లేదు. కానీ ఈ కొత్త పన్ను విధానంలో వస్తు ఉత్పత్తులకి అవి ఉత్పత్తి అవుతున్న రాష్ట్రాలలో కాకుండా అవి ఎక్కడ అమ్మబడుతాయో అక్కడే వాటి విలువ ఆధారంగా పన్ను విధించబడుతుంది. కనుక వస్తువులు లేదా ఆహార పదార్ధాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాలకి ఇకపై వాటిపై పన్ను విధించుకొనే అవకాశం ఉండదు.
ఒక వస్తువు ఉత్పత్తి దశ నుంచి వినియోగదారునికి చేతికి చేరేలోగా మధ్యలో ఎటువంటి పన్నులు విధించబడవు కనుక వాటి ధరలు చాలా తగ్గే అవకాశం ఉంటుంది. వినియోగదారుని చేతికి అందే సమయంలో వాటి విలువని బట్టి పన్ను నిర్ధారించబడుతుంది కనుక కార్పోరేట్ కంపెనీల మార్కెటింగ్ మాయాజాలం, పన్నుల ఎగవేతలు కూడా అరికట్టబడే అవకాశం ఉంటుంది. కనుక కేంద్ర ప్రభుత్వానికి ఈ పన్నుల రూపంలో నిర్దిష్టమైన ఆదాయం సమకూరుతుంది.
ప్రస్తుతానికి దీని వలన అంతా మేలే జరుగుతుందని ఆశిస్తున్నప్పటికీ దీని వలన దేశంలో మధ్యతరగతి, సామాన్య ప్రజలకి మేలు కలుగుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ కొత్త ఏకీకృత పన్ను విధానం అమలులోకి వచ్చే వరకు ఎదురు చూడవలసిందే. అయినా సింహం నోట్లో తలపెట్టినట్లు జీవిస్తున్న భారతీయులకి దీని వలన మేలు కలిగినా కీడు కలిగిన భరించకతప్పదు కనుక భయపడటం అనవసరం.