భారత్‌-పాక్‌ మద్య అదే తేడా...అందుకే...

September 28, 2019


img

కశ్మీర్‌ అంశంపై జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాకిస్థాన్‌ ఆక్రోశం వెళ్లగక్కుతోంది. కానీ “ప్రపంచదేశాలేవీ మాపై సానుభూతి చూపడం లేదు...మాకు మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు,” అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రపంచదేశాలు తమకు ఎందుకు మద్దతు ఇవ్వడంలేదు? అని ప్రశ్నించుకొని ఉంటే ఆయనకే సమాధానం లభించి ఉండేది. 

భారత్‌ అంటే అభివృద్ధి, లౌకికవాద ప్రజాస్వామ్యం. అదే.. పాక్‌ అంటే ఉగ్రవాదం..నిరుద్యోగం...దారిద్ర్యం. ఈ ఏడు దశాబ్ధాలలో భారత్‌ విదేశాలలో పెట్టుబడులు పెట్టేస్థాయికి ఎదిగితే, పాకిస్థాన్‌ విదేశాలను దేహీ... అంటూ రోజూ యాచించుకునే స్థితికి దిగజారిపోయింది. 

భారత్‌ వివిద దేశాలకు చెందిన యుద్ధవిమానాలను, యుద్ధనౌకలను, హెలికాఫ్టర్లను, భారీగా రక్షణ సామాగ్రిని, కొనుగోలు చేస్తూ, బుల్లెట్ రైల్ వంటి బారీ ప్రాజెక్టులను చేపట్టి అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, జపాన్ వంటి అగ్రదేశాలకు బిలియన్ డాలర్ల బిజినెస్ ఇస్తుంటే, పాకిస్థాన్‌ మాత్రం ‘ఉగ్రవాదంపై పోరు కోసం’ అంటూ అగ్రరాజ్యాల నుంచి డబ్బు, ఆయుధాలను అడుక్కోని తెచ్చుకుంటోంది. 

భారత్‌కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు అమెరికావంటి అగ్రరాజ్యాలలో సైతం పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి స్థానికులకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తూ, ఆయా దేశాలకు బారీగా పన్నులు చెల్లిస్తుంటే, పాకిస్థాన్‌ స్వదేశంలో కూడా పరిశ్రమలు స్థాపించుకోలేని దుస్థితిలో ఉంది.

అమెరికా అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీ మద్దతు కోరుతుంటే, స్వదేశంలో తన గద్దెను కాపాడుకోవడం కోసం ఇమ్రాన్ ఖాన్ డొనాల్డ్ ట్రంప్ సాయం ఆశిస్తున్నారు.  

అదేవిధంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తుంటే, ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్థాన్‌లో అడుగుపెట్టేందుకు విదేశీ సంస్థలు భయపడుతున్నాయి. 

గత ఏడు దశాబ్ధాలలో భారత్‌ అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ, అగ్రరాజ్యాల సరసన చేరబోతుంటే, అదే సమయంలో పాకిస్థాన్‌ పూర్తిగా దారిద్యస్థితికి చేరుకొని, ఉగ్రవాదమే అజెండాగా కాలక్షేపం చేస్తోంది. 

ఈవిధంగా సొంత ఇంటినే చక్కబెట్టుకోలేని పాకిస్థాన్‌ భారత్‌ అంతర్గత వ్యవహారమైన కశ్మీర్‌ విషయంలో కూడా వేలుపెడుతోంది. దానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు చర్చిస్తే అదో పెద్ద కధ అవుతుంది. కనుక భారత్‌-పాక్‌ పట్ల ప్రపంచదేశాలు ఎందుకు భిన్నంగా స్పందిస్తున్నాయని మాత్రమే ఆలోచిస్తే, పైన పేర్కొన్న అనేక కారణాలు, అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

ఏ దేశమైనా అభివృద్ధి చెందుతున్న మరో దేశంతో కలిసి పనిచేయాలనుకొంటుందే తప్ప ఉగ్రవాదమే జాతీయ అజెండాగా కలిగిన దేశంతో పనిచేయాలనుకోదనే చిన్న విషయం పాక్‌ పాలకులు తెలియదనుకోలేము. అయినప్పటికీ, ప్రస్తుతం పాక్‌లో నెలకొన్న తీవ్ర పరిస్థితుల దృష్ట్యా పాక్‌ పాలకులు ఇంతకంటే భిన్నంగా వ్యవహరించలేరు. వారి తీరు ఎన్నటికీ మారదు..మారలేదు...మార్చుకోలేరు...కనుక ప్రపంచదేశాల సానుభూతి, మద్దతు పొందడం అసంభవమేనని చెప్పవచ్చు.


Related Post