వారి సమస్యను కూడా హైకోర్టే తీర్చాలా?

January 13, 2018


img

వనపర్తి జిల్లాలో చిన్నంబావి మండల పరిధిలోని వెలటూరు, అయ్యవారిపల్లి గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుకొంటున్న విద్యార్ధినులు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి విన్నూత్నమైన మార్గం ఎంచుకొన్నారు. తమ పాఠశాలలలో మూత్రశాలలు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టు ప్రధానన్యాయమూర్తికి పోస్టు కార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. 

రెండు పాఠశాలలో మూత్రశాలలు లేకపోవడంతో బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని శ్రామిక వికాస కేంద్ర మండల సమన్వయకర్త కృష్ణయ్య అన్నారు. పాఠశాలలో మూత్రశాల లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో బాలికలు క్లాసులు జరుగుతుండగానే ఇళ్ళకు వెళ్ళిపోతున్నారని చెప్పారు. ఈ సమస్య కారణంగా చాలా మంది బాలికలు తగినన్ని మంచినీళ్ళు తాగడం మానేస్తున్నారని ఆ కారణంగా డీ హైడ్రేషన్, మూత్రకోశ వ్యాధుల బారిన పడుతున్నారని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు సమస్య తీవ్రతను గుర్తించినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని, అందుకే విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలలో కనీస మౌలికవసతులు, టాయిలెట్స్ వెంటనే నిర్మింపజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరుతూ బాలికల చేత హైకోర్టు ప్రధానన్యాయమూర్తికి పోస్టు కార్డులు వ్రాయించామని కృష్ణయ్య చెప్పారు.

ఇటువంటి చిన్న సమస్యను పరిష్కరించడంలో విద్యాశాఖలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దారుణం. ప్రభుత్వ పాఠశాలలలో మౌలికవసతులు కల్పించడానికి ప్రభుత్వం ఏటా బారీగా నిధులు మంజూరు చేస్తున్నప్పుడు వారు కనీసం మూత్రశాలలు ఎందుకు ఏర్పాటుచేయడం లేదు? ఆ నిధులన్నీ ఎక్కడ ఖర్చైపోతున్నాయి? అనే సందేహాలు కలుగక మానవు.

సంబంధిత అధికారులు స్పందించనప్పుడు కనీసం గ్రామపెద్దలు చొరవ మూత్రశాలలను నిర్మించవచ్చు. ‘ఆ పాఠశాలలో చదువుకొంటున్న బాలికలు మా పిల్లలే...వారికి ఇటువంటి ఇబ్బందిరానీయకూడదు’ అని గ్రామస్తులు ఆలోచించి ఉండి ఉంటే ఈ సమస్య గ్రామస్థాయిలోనే పరిష్కారమయ్యుండేది. కానీ గోటితో పోయే సమస్య పరిష్కారం కోసం గొడ్డలిని ఉపయోగించవలసి వచ్చింది. ఇటువంటి సమస్యలను కూడా హైకోర్టే తీర్చాలంటే సాధ్యమేనా? కనీసం ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు లేదా గ్రామస్తులు ఎవరైనా చొరవ తీసుకొంటే బాగుంటుంది. 


Related Post