త్వరలో రోడెక్కనున్న 422 కొత్త బస్సులు

July 10, 2025
img

టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో కొత్తగా 422 బస్సులు ప్రవేశపెట్టబోతోంది. గత ఏడాది మొత్తం 1,150 కొత్త బస్సులు కొనుగోలు చేయగా వాటిలో 728 మాత్రమే టీజీఎస్ ఆర్టీసీకి అందాయి. మిగిలిన 422 బస్సులు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి.

వీటిలో 294 బస్సులను రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలలో పల్లె వెలుగు కోసం కేటాయిస్తారు. మిగిలిన వాటిలో 88  మెట్రో డీలక్స్ బస్సులను హైదరాబాద్‌లో ఉపయోగిస్తారు. మిగిలిన వాటిలో 23 డీలక్స్ బస్సులు, 17 ఎక్స్‌ప్రెస్‌ బస్సులను హైదరాబాద్‌-జిల్లా కేంద్రాలకు, రాష్ట్రంలో ప్రధాన పట్టణాల మద్య ఉపయోగిస్తారు. 

మహాలక్ష్మి పధకం ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. కనుక మరిన్ని కొత్త బస్సులు ప్రవేశపెట్టడం అనివార్యంగా మారింది. 

ఇక నుంచి హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలలో తిరిగే మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్, సిటీ ఆర్డినరీ బస్సులు 13 లక్షల కిలోమీటర్లు తిరిగినా లేదా కొనుగోలు చేసి 15 ఏళ్ళయినా వాటిని సర్వీసుల నుంచి తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.

Related Post