టాలీవుడ్‌లో షూటింగ్‌లకు సమ్మె దెబ్బ

June 05, 2024


img

తెలుగు సినిమా పరిశ్రమకు నిత్యం ఏదో ఓ రూపంలో ఆటుపోట్లు తప్పడం లేదు. గత రెండు మూడు నెలల నుంచి ఏపీ, తెలంగాణలతో సహా దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొని ఉండటంతో ప్రేక్షకులు లేక సినిమా థియేటర్లు మూసుకోవలసి వచ్చింది.

ఎన్నికల హడావుడి కారణంగా అనేక చిన్నా పెద్ద సినిమాలు విడుదల వాయిదా వేసుకోవలసి వచ్చింది. పాఠశాలలు, కాలేజీలకు వేసవి సెలవులు ఇచ్చినప్పుడు సినీ పరిశ్రమకు మంచి బిజినెస్ సీజన్‌. కానీ ఎన్నికల కారణంగా ఈ సీజన్‌లో సినిమాలు విడుదల చేసుకోలేక పోవడంతో సినీ పరిశ్రమ నష్టపోయింది. 

ఇప్పుడు ఎన్నికల హడావుడి ముగిసి మళ్ళీ జనాలు థియేటర్లకు వస్తుండటంతో మళ్ళీ వరుసపెట్టి సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సమయంలో సినీ పరిశ్రమకు వాహనాలు సరఫరా చేసే యజమానులు సమ్మె ప్రారంభించడంతో షూటింగ్‌లకు అంతరాయం కలుగుతోంది. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమకు 1200 మంది వాహన యజమానులు రోజుకి 900 వాహనాలు సరఫరా చేస్తున్నారు.

అయితే వారి సమస్యలు వారికీ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు, వాహనాల విడిభాగాల ధరలు, మరమ్మతు ఛార్జీలు, డ్రైవర్ల జీతభత్యాలు అన్నీ విపరీతంగా పెరిగిపోయాయని కానీ తమ గోడు నిర్మాతల మండలికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. 

అందుకే తప్పనిసరి పరిస్థితులలో సమ్మె చేయవలసి వస్తోందని చెప్పారు. తాము నష్టాలు భరిస్తూ వాహనాలు సరఫరా చేయలేమని, కనుక తక్షణం తమ కిరాయి చార్జీలను పెంచాలని వాహన యజమానులు డిమాండ్ చేస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష