మ్యూజిక్ షాప్ మూర్తి... ట్రైలర్‌

June 01, 2024


img

అజయ్ ఘోష్... ఈ పేరు వినగానే నున్నటి గుండుతో క్రూరత్వం నిండిన కళ్ళతో విలన్‌ వేషాలు వేసే రూపమే కనిపిస్తుంది. కానీ అటువంటి వ్యక్తిని ప్రధాన పాత్రలో పెట్టి ఓ సినిమా తీయాలంటే ఎంత ధైర్యం ఉండాలి? కానీ తీశారు... ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ పేరుతో! 

ఈ సినిమాలో అజయ్ ఘోష్ సినిమా పాటల క్యాసెట్స్, సీడీలు అమ్ముకునే షాపు యజమానిగా, కుటుంబ బరువు బాధ్యతలు మోస్తున్న ఓ మద్య తరగతి గృహస్తుగా నటించారు.

మ్యూజిక్ షాప్ వ్యాపారం తప్ప మరో పని చేతకాని ఆయన ఇంటా, బయటా ఎటువంటి సమస్యలు ఎదుర్కున్నారు? మ్యూజిక్ షాపు యజమాని నుంచి ‘డీజే’గా ఎలా మారారు? చివరికి ఏం సాధించారనేది ఈ సినిమా కధ అని తాజాగా విడుదలైన ట్రైలర్‌తో చెప్పేశారు. 

బ్రహ్మానందం కామెడీ తప్ప మరొకటి చేయలేరనుకునే వారికి రంగమార్తాండ సినిమాలో తన నట విశ్వరూపం చూపి ఆశ్చర్యపరిచిన్నట్లే, అజయ్ ఘోష్ విలన్‌గా పాత్రలు తప్ప మరొకటి చేయలేరనుకునే వారికి ఈ సినిమాలో ఆయన ఆశ్చర్యపరచబోతున్నారు. 

తన నటనతో అందరినీ మెప్పించిన ఆమని చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ఆయన భార్యగా కనిపించబోతున్నారు. చాందినీ చౌదరి, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: శివ పాలడుగు, సంగీతం: పవన్, కెమెరా: శ్రీనివాస్ బెజుగమ్, ఎడిటింగ్: బి.నాగేశ్వర రావు చేశారు. 

ఫ్లై హై బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగరావు గారపాటి కలిసి నిర్మించిన ఈ సినిమా జూన్ 14వ తేదీన విడుదల కాబోతోంది. Related Post

సినిమా స‌మీక్ష