ఎన్నాళకు వచ్చావ్ హనుమాన్...సూపర్ హీరోగా భలే ఉందే!

November 14, 2023


img

జాంబియా రెడ్డి సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు ‘జాంబియా’లను పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, మళ్ళీ తేజ సజ్జాతోనే ‘హనుమాన్’ అనే సైన్స్ ఫిక్షన్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌, టీజర్ అందరినీ చాలా ఆకట్టుకొన్నాయి. ఆదిపురుష్ గ్రాఫిక్స్ కంటే హనుమాన్ గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

నిజానికి ఈ సినిమా ఈ ఏడాది మే నెలలోనే విడుదలకావలసి ఉన్నప్పటికీ, ఆదిపురుష్ కోసం హనుమాన్ వెనక్కు తగ్గాడు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ కోసం సినిమా రిలీజ్ వాయిదా వేసుకొన్నామని ప్రశాంత్ వర్మ చెప్పుకొన్నాడు. హనుమాన్ సినిమాని వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. 

చాలా రోజుల తర్వాత ఇవాళ్ళ హనుమాన్ సినిమా నుంచి సూపర్ హీరో అంటూ సాగే లిరికల్ కామిక్ సాంగ్ విడుదల చేశారు. అది ఈ సినిమా ఏదో అసాధారణమైనది కాకుండా ఓ మంచి ఎంటర్‌టైన్‌ర్‌ అని చెపుతున్నట్లుంది. ఇదీ మంచిదే. భారీ అంచనాలతో వెళ్ళి నిరాశపడకుండా ఓ మంచి సినిమా అనుకొని ప్రేక్షకులు థియేటర్లకు వెళితే కాస్త అటూ ఇటూ అయినా సినిమాకు ఢోకా ఉండదు.    

ఈ సినిమాలో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్‌, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్య, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్, హరిగౌర, కృష్ణ సౌరభ్, కెమెరా: దాశరధి శివేంద్ర అందిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం , హిందీ, మరాఠీ భాషలతో పాటు ఇంగ్లీష్, జపనీస్, కొరియన్, చైనీస్, స్పానిష్ భాషలలోను విడుదల చేయబోతున్నారు. Related Post

సినిమా స‌మీక్ష