కేసరి పాస్ కానీ టైగర్ ఫెయిల్?

October 21, 2023


img

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శ్రీలీల తండ్రీకూతుర్లుగా వచ్చిన భగవంత్ కేసరి రొటీన్ మాస్ మసాలా సినిమా అయినప్పటికీ దానిలో దర్శకుడు అనిల్ రావిపూడి, తొలిసారిగా బాలకృష్ణని మరో కోణంలో కూడా చూపడం, బాలకృష్ణ చేత తెలంగాణ యాసలో మాట్లాడించడంతో ప్రేక్షకులు సినిమాకు పాస్ మార్కులు వేశారు. దీంతో బాలకృష్ణ, అనిల్ రావిపూడి ఇద్దరూ గట్టెక్కిపోయారు. 

ఇక దర్శకుడు వంశీ ఎంతో కష్టపడి, ఇష్టపడి మాస్ మహరాజ్ రవితేజతో తీసిన టైగర్ నాగేశ్వరరావు సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. స్టువర్టుపురానికి చెందిన బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కధని సినిమాగా తీయాలనుకోవడమే కొంచెం రిస్క్. మళ్ళీ దానిని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయడం ఇంకా పెద్ద రిస్క్. 

పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ గంధం చెట్ల స్మగ్లరుగా ఓ నెగెటివ్ పాత్రలో నటించినప్పటికీ, దర్శకుడు సుకుమార్ ఆ పాత్రని ట్రీట్ చేసిన విధానంతో ప్రేక్షకులు అతనిలో హీరోని మాత్రమే చూశారు తప్ప దుష్టుడిగా చూడలేదు. కానీ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరో ఓ బందిపోటు దొంగ అని తెలిసి ఉన్నప్పటికీ ప్రేక్షకులు రవితేజను హీరోగానే ఊహించుకొని థియేటర్లకు వచ్చి కంగు తిన్నారు. 

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా తీసినప్పటికీ, ప్రేక్షకులు అంత రక్తపాతాన్ని భరించలేకపోయారు. ఇంకా ఈ సినిమాని దెబ్బతీసిన ఇతర అంశాల గురించి సినిమా రివ్యూలలో వ్రాసేశారు. కనుక వాటి గురించి చెప్పుకోనవసరం లేదు. 

కనుక ఎంత పెద్ద హీరోలైన కొత్తదనం చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని, కానీ కొత్తదనం పేరుతో ఇష్టం వచ్చిన్నట్లు తీస్తే రిజెక్ట్ చేస్తారని ఈ రెండు సినిమాలు నిరూపించాయి.


Related Post

సినిమా స‌మీక్ష