జూ.ఎన్టీఆర్ అభిమానులకు దర్శకుడు కొరటాల శివ ఓ షాకింగ్ శుభవార్త చెప్పారు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నకొద్దీ సినిమాలో పాత్రలు, పరిధి చాలా పెద్దదని అర్దమైందని, కనుక కధకు, పాత్రలకు పూర్తి న్యాయం చేయాలంటే ఒక్క భాగం సరిపోదని, రెండు భాగాలలో దేవరని తీయాలని నిర్ణయించుకొన్నట్లు కొరటాల తెలిపారు.
ఇప్పుడు అగ్రహీరోలందరి సినిమాలు రెండు భాగాలుగానే వస్తున్నందున జూ.ఎన్టీఆర్ సినిమా దేవర కూడా రెండు భాగాలలో వస్తున్నందుకు అభిమానులు చాలా సంతోషిస్తున్నారు.
అయితే చిరంజీవి, రామ్ చరణ్‌లకు ‘ఆచార్య’ వంటి అతిపెద్ద ఫ్లాప్ ఇచ్చిన కొరటాల, దేవరని ఏమి చేస్తాడో అని అభిమానులు భయపడుతూనే ఉన్నారు. అది ఎలా ఉంటుందో తెలియక ముందే దేవర సినిమాని రెండు భాగాలుగా తీస్తామని కొరటాల చెప్పడంతో అభిమానులు ఇందుకు సంతోషిస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు కూడా.
జూ.ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి జంటగా చేస్తున్న దేవర సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది. అప్పుడు కానీ ఈ సినిమా ఎలా ఉంటుందో తెలీదు. ఒకవేళ అది సూపర్ హిట్ అయితే ఏ ఇబ్బంది ఉండదు. కానీ బాగోకపోతే?
దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.
రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి దేవర సినిమాను నిర్మిస్తున్నారు.