మరో పాన్ ఇండియా మూవీతో నిఖిల్

June 01, 2023


img

తెలుగు సినీ పరిశ్రమలో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు సమాంతరంగా నడుస్తూనే ఉన్నాయి. అయితే చిన్న హీరోలు, దర్శకులతో నిర్మించే చిన్న సినిమాలు బోర్లా పడితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు కానీ ఓ పెద్ద సినిమా బోర్లా పడితే దాని గురించి చాలా కాలం చర్చలు సాగుతుంటాయి. అదేవిదంగా చిన్న సినిమాలు సూపర్ హిట్ అయితే అవి చకచకా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోతున్నాయి. నిఖిల్ నటించిన కార్తికేయ-1,2 సినిమాలు అటువంటివే. ఇప్పుడు ప్రభాస్‌ సినిమా అంటే పాన్ ఇండియాకి తగ్గడానికి వీల్లేదన్నట్లే, నిఖిల్ చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తీసి విడుదల చేస్తుండటం చాలా సంతోషించాల్సిన విషయమే. 

నిఖిల్ ప్రస్తుతం ‘స్పై’ అనే ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తీస్తున్నాడు. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏవిధంగా చనిపోయారనే రహస్యాన్ని చేదించే గూడఛారిగా నిఖిల్ నటిస్తున్నాడు. ప్రముఖ సినీ ఎడిటర్ గ్యారీ బీహెచ్ తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో , ఐశ్వర్య మేన్, సన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, మకరంద్ దేశ్ పాండే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 29న విడుదల కాబోతోంది.

దీని తర్వాత నిఖిల్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశాడు. విశేషమేమిటంటే ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ నిర్మించబోతున్నారు. దీనిని కూడా భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారు. 

నిఖిల్ 20వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ప్రీ-లుక్‌ పోస్టర్‌ ఈరోజు విడుదల చేశారు. ఇటీవల పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టించిన సెంగోల్ (రాజదండం) వంటిది చూపిస్తూ రేపు ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు తెలియజేయబోతున్నట్లు దానిలో సూచించారు. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారకు డైలాగ్స్ అందించిన వాసుదేవ్ ఈ సినిమాకు డైలాగ్స్ వ్రాస్తున్నారు. సూపర్ డూపర్ హిట్ అయిన కేజీఎఫ్ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు మ‌నోజ్ ప‌ర‌మ‌హంస‌, ర‌వి బ‌స్రూర్ ఈ సినిమాకు పనిచేయబోతున్నారు. కనుక ఈ సినిమా కూడా నిఖిల్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.  


Related Post

సినిమా స‌మీక్ష