పుష్ప-2 యూనిట్‌కి నార్కట్‌పల్లి వద్ద బస్సు ప్రమాదం

May 31, 2023


img

అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటిస్తున్న పుష్ప-2 చిత్రబృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వారు శ్రీకాకుళం జిల్లాలో సినిమా షూటింగ్‌ ముగించుకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా, ఈరోజు తెల్లవారుజామున నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లి వద్ద విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం డిపోకూ చెందిన ఆర్టీసీ బస్సు దారిలో బ్రేక్‌డౌన్‌ అవ్వడంతో, డ్రైవర్ బస్సుని రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఆగి ఉన్న ఆ ఆర్టీసీ బస్సును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో చిత్ర బృందంలోని ఇద్దరు ఆర్టిస్టులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికుల సాయంతో వారు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేసుకొని వేరే బస్సులో అందరూ హైదరాబాద్‌ వెళ్ళిపోయారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిన్నట్లు తెలుస్తోంది. 

సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-1కి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ సినీ నటుడు ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతిబాబు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలాయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాయి. 

ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. పుష్ప2 ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2024 సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Related Post

సినిమా స‌మీక్ష