నచ్చితే పెళ్ళి చేసుకోండి... నచ్చకపోతే విడాకులు తీసుకోండి: తేజ

May 25, 2023


img

ఒకప్పుడు దర్శకుడు తేజ చక్కటి రొమాంటిక్ సినిమాలు అందించి మంచి పేరు తెచ్చుకొన్నారు. కానీ 2011, మార్చిలో తన మూడేళ్ళ చిన్న కొడుకు ఆరోహ్ మరణించడంతో ఆ బాధ నుంచి తేరుకోలేక చాలా ఏళ్ళపాటు సినిమాలు చేయలేదు. చాలా ఏళ్ళ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా హిట్ అవలేదు. 

మళ్ళీ ఇప్పుడు దగ్గుబాటి అభిరామ్, గీతికా తివారీలను హీరో హీరోయిన్లుగా పెట్టి తీసిన ‘అహింస’ అనే సినిమాతో జూన్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. కనుక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో రెండు ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడారు. ఒకటి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య. రెండోది తన కొడుకు అమితోవ్ తేజ, కూతురు కెరీర్, జీవితాల గురించి. 

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి మాట్లాడుతూ, “అతను ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడో అందరికీ తెలుసు. అయినా ఆ విషయం నా నోట చెప్పించాలని మీరందరూ ప్రయత్నిస్తుంటారు. మీ అందరికీ (మీడియా) తెలియనట్లు ఎందుకు నటిస్తున్నారో నాకు అర్దం కాదు,” అని దర్శకుడు తేజ అన్నారు. 

పెద్ద కొడుకు అమితోవ్ తేజ, కూతురు ఐలా తేజల గురించి మాట్లాడుతూ, “తను దర్శకత్వంలో శిక్షణ తీసుకొన్నాడు. కానీ త్వరలోనే తనని హీరోగా పరిచయం చేయబోతున్నాను. ఐలా తేజ విదేశంలో చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చేసింది. తాను ఏమి చేయబోతోందో తనిష్టం. ఒకవేళ ఎవరినైనా పెళ్ళి చేసుకోవాలనుకొంటే సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని సలహా ఇచ్చాను. పెళ్ళి చేసుకొన్నాక నచ్చకపోతే విడాకులు తీసుకోవడానికి సంకోచించవద్దని కూడా చెప్పాను. జీవితంలో మనం సుఖంగా ఉండటం కోసం మనం ఏం కోరుకొంటే అదే చేయాలి తప్ప పక్క వాళ్ళ మెప్పు కోసం ఏమీ చేయవలసిన అవసరం లేదని ఇద్దరు పిల్లలకి చెపుతుంటాను. వాళ్ళు అలాగే ఉంటున్నారు కూడా,” అని తేజ చెప్పారు. 


Related Post

సినిమా స‌మీక్ష